“నాకు చాలా తిక్కుంది..కానీ దానికీ ఓ లెక్కుంది..” “లాస్ట్ పంచ్ మనదయితే ఆ కిక్కే వేరబ్బా…” ఈ పాపులర్ డైలాగులు ఎవరు పలికారో అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తిని రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు కెలికొదిలారు… రాజధాని ప్రాంతం మధ్యలో ఉన్న భూములను వదిలిపెట్టి ఏవిధంగా రాజధానిని నిర్మించవచ్చో పవన్ కళ్యాణ్ చెపితే బాగుంటుంది కదా? మధ్యలో ఉన్న ఆ భూములను వదిలిపెట్టి గాలిలో త్రిశంఖు స్వర్గం నిర్మించలేమని యనమల రామకృష్ణుడు చాలా ఘాటుగా జవాబు చెప్పారు. లాస్ట్ పంచ్ లో ఉండే ఆ త్రిల్ కోసం పవన్ కళ్యాణ్ కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చేరు.
ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమి ట్వీట్ చేసారంటే, “నేను ఎంతో బాధ్యతతో రైతుల సమస్యని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే విజ్ఞతతో స్పందిచడం మానేసి రైతుల ఆవేదనని వెటకారం చెయ్యడం వారికే చెల్లింది. సినిమా పరిశ్రమకి హైదరాబాద్ లో ఇచ్చినివి కొండలు..బహుళ పంటలు పండే పొలాలు కాదు, ఇది రామకృష్ణుడు గారికి తెలియదనుకుంట. పైగా..హైదరాబాద్ కొండల్లో కానీ, విశాఖపట్నం కొండల్లో కానీ నాకైతే స్టూడియోలు లేవు..ముందు కట్టేది స్వర్గం అని తెలిస్తే అది త్రిశంకు స్వర్గమా రెగ్యులర్ స్వర్గమా అనేది తర్వాత అలోచించవచ్చు.. నేను త్వరలోనే బేతపూడి, ఉండవల్లి, పెనుమాక తదితర నదీ పరివాహక గ్రామాలలో రైతులను కలుస్తాను,” అని మెసేజ్ పెట్టారు.
ఇంతవరకు పవన్ కళ్యాణ్ ట్వీట్ మేసేజులతోనే సరిపెట్టుకొంటూ వచ్చేరు. కానీ తన సూచనలని యనమల రామకృష్ణుడు ధిక్కరించడంతో రాజధాని ప్రాంతంలో గ్రామాలలో రైతులను కలవడానికి మళ్ళీ బయలుదేరుతున్నారని అర్ధమవుతోంది. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోమని చెప్పి మళ్ళీ ఇప్పుడు గ్రామాలలో రైతులను కలవాలనుకోవడం చూస్తే, ఆయనే స్వయంగా ఇప్పుడు ప్రభుత్వానికి సమస్యను సృష్టిస్తున్నట్లయింది.
సారవంతమయిన పంట పొలాల మీద రాజధాని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన చేసిననాడు పవన్ కళ్యాణ్ దానిని వ్యతిరేకించలేదు. ఆ తరువాత ఎప్పుడో భూసేకరణ కార్యక్రమం దాదాపు ముగుస్తున్న సమయంలో రాజధాని ప్రాంతంలో పర్యటించి హడావుడి చేసి వెళ్లిపోయారు. మళ్ళీ వెంటనే వచ్చి రైతుల తరపున పోరాడుతానన్న పెద్దమనిషి ఇప్పటి వరకు కనబడలేదు. కనీసం మాట్లాడలేదు. ఒకవేళ ఆయన మొదటి నుండి దీనిని గట్టిగా వ్యతిరేకిస్తూ ఉండి ఉంటే ఈరోజు ఆయన మాటలకి చాలా విలువ ఉండేది. కానీ అప్పుడు మౌనంగా ఊరుకొని, మధ్యలో కనబడకుండాపోయి మళ్ళీ ఇప్పుడు హటాత్తుగా ఊడిపడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం చాలా అసంబద్దంగా ఉంది. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి కూడా అక్కడ రాజధాని నిర్మాణాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కనుక ఆయన దాని గురించి మాట్లాడినా, పోరాడినా అర్ధం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి హడావుడి చేయడం దేనికో తెలియదు. ఒకవేళ ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఆయన సిద్దపడితే, మిగిలిన గ్రామాల రైతులు కూడా తమ భూములు ఇవ్వడానికి నిరాకరిస్తే అప్పుడు ప్రభుత్వం పరిస్థితి ఏమిటి? అని ఆయన ఆలోచిస్తే బాగుంటుంది.