తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య పదవీకాలం నేటితో పూర్తవడంతో మహారాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్న సి.హెచ్. విద్యాసాగర్ రావుకి అదనపు బాధ్యతలు అప్పగించారు. తమిళనాడుకి కొత్త గవర్నర్ ని నియమించేవరకు ఆయనే బాధ్యతలు నిర్వర్తిస్తారు.
రోశయ్య పదవీ కాలం పొడిగించవచ్చని మీడియాలో ఊహగానాలు వినిపించాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయనని పదవీ కాలం పూర్తయ్యేవరకు కొనసాగనిచ్చి గౌరవంగా సాగనంపడమే చాలా గొప్ప విషయం కనుక ఆయన పదవీ కాలం పొడిగిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది.
తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుకి గవర్నర్ పదవి ఇప్పిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ఉన్నందున, ఆయన దానికోసం చాలా కాలంగా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే వివిధ రాష్ట్రాలకి కేంద్రప్రభుత్వం గవర్నర్లని నియమించినప్పటికీ ఆయనకి అవకాశం దక్కలేదు. కనీసం ఇప్పుడైనా అవకాశం దక్కుతుందని ఎదురుచూస్తే మళ్ళీ నిరాశే ఎదురయింది. కానీ తమిళనాడుకి పూర్తి స్థాయి గవర్నర్ ని ఇంకా నియమించవలసి ఉంది కనుక మోత్కుపల్లి చంద్రబాబు నాయుడుపై కొంచెం గట్టిగా ఒత్తిడి చేస్తే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చు.