టీవీ 999లో టెర్రరిస్ట్ దోమతో ఇంటర్వ్యూ వస్తుందని తెలిసినప్పటి నుంచీ ప్రేక్షకలోకంలో ఒకటే టెన్షన్. దోమేమిటీ, అందునా టెర్రరిస్ట్ దోమేమిటీ ఇలా నేరుగా టీవీ స్టేషన్ లోకి జొరబడి ఏకంగా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడమేమిటీ? అందరికీ ఒకటే ఆశ్చర్యం. ఈలోగా ఇంటర్వ్యూ లైవ్ షోకి కౌంట్ డౌన్ మొదలైంది. 10…9..8…2..1…
యాంకర్ : నమస్కారం మీరంతా ఈ ఇంటర్వ్యూ షోకోసం ఎదురుచూస్తుంటారని తెలుసు. ఇవ్వాళ మన స్టూడియోకి టెర్రరిస్ట్ దోమగారు వచ్చారు. వారితో మాట్లాడుతూ మానవాళి శాంతిస్థాపన కోసం ప్రయత్నం చేస్తాను.
దోమగారూ, మేము అడిగిన వెంటనే ఇంటర్వ్యూకి అంగీకరించినందుకు థాంక్స్ అండీ,
దోమ : నమస్కారం. ఈ షో టైటిల్ కార్డు ఇప్పుడే చూశాను. (కాస్తంత కోపంగా) ఏమయ్యా, యాంకరూ, టెర్రరిస్ట్ దోమతో ఇంటర్వ్యూ అని వేశావ్. నేను టెర్రరిస్ట్ నని ఎవరు చెప్పారు, హాయమ్మా… (కసురుకుంది దోమ)
యాంకర్ : (నసుగుతూ) అదే, మరి…మరి, మీరు…అంటే దోమలైన మీరు … దాడులూగట్రా జరుపుతుంటారుకదా…అందుకని అలా… హ్హీహ్హీహ్హీ… వేశామన్నమాట.
దోమ: ఏడ్చినట్టుంది నీ తెలివితేటలు. దాడులు జరిపితే టెర్రరిస్ట్ అయిపోతారా? చూడు యాంకరూ, దోమలమైన మాకు స్వేచ్ఛగా దాడులు జరిపే హక్కు ఆ భగవంతుడు ఇచ్చాడు. అసలు దోమలరాజ్య స్థాపనే మా ధ్యేయం.
యాంకర్ : అంటే, జీహాద్…జీహాద్…
దోమ; నీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడకు. ఆ జీహాద్ తో మాకు సంబంధంలేదు. మాకంటూ ప్రత్యేక రాజ్యం కావాలనుకోవడంలో తప్పేముందీ. నీకో విషయం తెలుసా, మీ మానవుల జనాభాకంటే మేము ఓ వందరెట్టు ఎక్కువ.
యాంకర్ : (తెగ ఆశ్చర్యపోతూ) ఆఁ….! నిజమా !! అంతగా మీ జనాభా ఎలా పెరిగిపోయిందీ…?
దోమ: ఊరికే అలా ఆశ్చర్యపోయి కిందపడిపోకు. ఇప్పుడు నేను చెప్పిన లెక్క కూడా ఏదో ఉజ్జాయింపుగా చెప్పిందే. అంతకంటే ఎక్కువే ఉంటుంది. మేము సెన్సెస్ తీయించలేదు. జనగణన చేయిస్తే మీరు దడుసుకోవడం ఖాయం. ఇప్పుడు చెప్పండి, ఈ భూప్రపంచంలో ఎక్కువ మంది ఉన్న దోమజనాభా తనకంటూ రాజ్యం నిర్మించుకుంటే తప్పేముందీ ?
యాంకర్ : (మధ్యలో కల్పించుకుంటూ) దోమగారు..ఒక్కనిమిషం. దోమల రాజ్యస్థాపన ఎలా జరిగిందో, వారి వద్ద ఉన్న మారణాయుధాల పరిస్థితి ఏమిటో అడిగి తెలుసుకునేముందు ఇప్పుడో స్మాల్ బ్రేక్.
(కాసేపు వాణిజ్య ప్రకటనలు వచ్చాక, మళ్ళీ షో బ్యాంగ్ పడింది)
యాంకర్ : వెల్ కమ్ బ్యాక్… దోమగారూ చెప్పండి, మీరు అంటే దోమలంతా కలిసి ప్రత్యేకంగా రాజ్యం ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. మరి ఆ రాజ్యం పేరేమిటీ..?
దోమ : (దర్జాగా కాలుమీదకాలేసుకుని, టేబుల్ మీద పెట్టిన `బ్లడ్’ కాఫీకప్పుని ఎత్తిపట్టుకుని త్రాగుతూ…) మాది దోమష్మతి రాజ్యం.
యాంకర్: ఏంటీ దోమష్మతి రాజ్యమా… మీరు కూడా రాజమౌళి చిత్రం బాహుబలి చూశారాఏంటీ..
దోమ; ఏం, బాహుబలి మీ సొంతమా, ఓ నిజం చెప్పనా, ఈ సినిమా రిలీజ్ కంటే ముందే మేము చూశాము. సినిమా ఫైనల్ టచింగ్ పనులప్పుడే చూసేశాము. మాకు టిక్కెట్లు అక్కర్లేదు. చూడాలనిపిస్తే చాలు, గుంపుగా వెళ్ళేసి హాల్లో దూరేసి ఎంచక్కా సినిమా చూసేస్తాం. మమ్మల్ని ఏ శక్తి ఆపలేదు. అలా సినిమా చూస్తున్నప్పుడే మా రాజ్యానికి `దోమష్మతి’ అని పేరు పెట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము.
యాంకర్ : అవును, ఇవ్వాళ వరల్డ్ మస్కిటో డే అంటగదా,
దోమ: అవును, బాగా గుర్తుచేశావ్. ఇవ్వాళ ప్రపంచ దోమల దినం. మీ మానవులు చాలా స్వార్థపరులోయ్. వాళ్ల డేలు..అదే ఫాదర్స్ డే, మదర్స్ డే, ప్రేమికుల డేలను దినోత్సవాలని పిలుచుకుంటారు, కానీ మాకు మాత్రం `దినం’ పెట్టినట్టు పిలుస్తున్నారు. నిజం చెప్పాలంటే మీరే టెర్రరిస్టులు. భగవంతుడు మాకు అప్పగించిన పనిని, అదే మీ రక్తం పీల్చే పనిని యథావిధిగా చేస్తుంటే, మిమ్మల్ని చంపితీరుతామంటూ ప్రతిజ్ఞలూ గట్రా చేసేసుకుంటూ వరల్డ్ మస్కిటో డే చేసేసుకుంటున్నారు.
యాంకర్ : మరి అది నిజమేకదా…?!
దోమ: (కోపంగా అరిచేస్తూ) ఛత్.. నీకు అర్థమై చావడంలేదు. మేము టెర్రరిస్టులమేంటీ నీ బొం… మేము మా పొట్టనింపుకోవడంకోసం రక్తం పీలుస్తాము. అంతే…
యాంకర్ : మరి మీ వల్ల మాకు అనేక రోగాలు…మలేరియా, బోదకాలు, డెంగ్యూ ఇలా…
దోమ : ఆ రోగాలు వస్తే…?!
యాంకర్ : మీరు కుట్టడంవల్లనేకదా ఈరోగాలతో ఏటా లక్షలాదిమంది మరణిస్తున్నారు. మేమంతా భయపడి వరల్డ్ మస్కిటో డే అని పెట్టుకుని మిమ్మల్ని సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకుంటున్నది.
దోమ ; అదే తప్పు. మీకు రోగాలు రావాలనీ, మరణించాలని మేము అనుకోవడంలేదే. నిజం చెప్పాలంటే, మీరంతా పచ్చగా ఉండాలనే మేం కోరుకుంటాము. మీరు నిండు నూరేళ్లూ జీవిస్తుంటేనే మా ముందుతరాలవాళ్లు కూడా మీ రక్తం పీలుస్తూ హాయిగా బతుకుగడిపేయాలనే కోరుకుంటాము. అదే మీరు అర్థాయుష్కులైతే మాకేనష్టం. రోజూ రక్తం ఇచ్చే మనిషిని ఎవరైనా చంపుకుంటారా. రోజూ బంగారు గుడ్డుపెట్టే బాతు కథ నీకు తెలుసుకదా..
యాంకర్ : దోమగారూ, మీరు చెప్పేది చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. అంటే మీరు మానవాళి శాంతినే కోరుకుంటున్నారా? (రెట్టించి అడిగాడు)
దోమ: ఎస్, ఎనీ డౌట్. కచ్చితంగా మేము లోకకల్యాణాన్నే ఆకాంక్షిస్తున్నాము.
యాంకర్ : మరైతే, మీవల్ల అంతమంది చనిపోతుంటే మీకేమనిపిస్తోంది.
దోమ; (నింపాదిగా మిగతా బ్లడ్ కాఫీ కూడా తాగేసి) చాలా బాధగా ఉంది. ప్రపంచ దోమల దినోత్సవం సందర్బంగా మేము ఇందాకనే సంతాపం వ్యక్తంచేశాము. అయితే, మానవులు ఇందుకు ప్రతిగా మా జాతిని నాశనం చేయాలనుకుంటున్నారు. అసలు మేంఏం అపకారంచేశాము. మీకు నొప్పి తెలియకుండా అతి జాగ్రత్తగా వాడిముక్కుతో చర్మానికి రంధ్రంచేసి ఓ మిల్లీలీటర్ బ్లడ్ తాగేసి కడుపునిండిదన్న సంతోషంతో ఇంటిపైకప్పుకో, బీరువాల వెనక్కోచేరి హాయిగా నిద్రపోతాము. లీటర్లకొద్దీ రక్తం మీవద్ద ఉంది, ఓ మిల్లీలీటర్ రక్తదానం చేస్తే మీకేం పోయింది. మాకు ఆమాత్రం రక్తం ఇవ్వడానికి ఏడిచిచస్తారు. అదే రక్తదాన శిబిరాలంటూ పెడితే అక్కడికిపోయి అరలీటర్ రక్తం ఇచ్చేస్తుంటారు. సర్వజీవులమీద ప్రేమఉందని కల్లబొల్లికబుర్లు చెబుతారేగానీ, ఏనాడైనా, దోమలకోసం రక్తం దానంచేస్తే పుణ్యమొస్తుందని అనుకున్నారా? లేదే… నాగుల పంచమి, నాగుల చవతినాడు పాములపుట్టలో పాలుపోస్తారే, మరి వరల్డ్ మస్కిటో డేనాడైనా మాకు ఇంత రక్తం ఇచ్చారా అని అడుగుతున్నాను.
యాంకర్: దోమలకోసం రక్తదానం చేయాలంటున్నారు దోమగారు. ఈ లైవ్ షోలో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్…
(మళ్ళీ బ్రేక్ అయ్యాక…)
యాంకర్ : చెప్పండి దోమగారూ, మీరెలా టెర్రరిస్ట్ అయ్యారు ? అందుకు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు??(చాలా తెలివిగా అడిగాననుకుని కెమేరావైపు తిరిగి అదోలా విజయహాసం చేశాడు యాంకర్)
దోమ : ఛత్… నీ తెలివి దొంగలెత్తుకెళ్లా… నేను చెప్పేది సాంతం వినవు, మధ్యలో బ్రేక్..బ్రేక్ అంటావు. ఏంటీ మళ్ళీ అదే కూతకూస్తున్నావ్. మేము టెర్రరిస్టులమా? ఎవర్రా చెప్పింద?. ఇటు లాక్కురా, మా దండును పంపించి ఒంట్లో రక్తంలేకుండా పీల్చేయమంటాను. హన్నాన్నా… ఎంతమాట…ఎంతమాట. మాకోసం ప్రేమగా రక్తమివ్వాల్సిందిపోయి, మా దండుపై విష ప్రయోగం చేస్తారా? ఎంత సాహసం..ఎంత కండకావరం. ఇప్పుడే మా దండును పిలుస్తాను. యుద్ధానికి సిద్ధం కమ్మనమని ఆజ్ఞాపిస్తాను… హే చిన్నమయ్యా, హే జంబూ, హే లంబూ… ఈ మానవజాతిపై యుద్ధానికి సిద్ధంకండి…
(అంటూ దోమ నాయకుడు పద్యం అందుకున్నాడు,,,,)
అష్టదిక్కుంభి కుంభాగ్రాలపై
మన సింహధ్వజముగ్రాల చూడవలదె
గగన పాతాళ లోకాలలోని సమస్త భూతకోటి దోమలకు మొక్కవలదె…
ఏదేశమైన, నా ఆదేశ ముద్రపడి
సంభ్రమాశ్చార్యాల జరుగవలదె.,
జైహై దోమోద్ఘజ…
జయహే దోమోద్ఘజ
అని దోమ గురువే కొండాడవలదె…
యాంకర్ : (అయోమయంగా) అయ్యా దోమగారూ, శాంతించండి, ఇప్పుడెవరితో యుద్దం. మీరలా పద్యాలు పాడుతుంటే నాకు కంగారేస్తోంది… ఇందాక మీరేమన్నారు దోమగారూ… మీమీద విషప్రయోగం చేశామా…ఎప్పుడు? ఎక్కడ??
దోమ: విషప్రయోగాలు చేయడంలేదూ… పొద్దున తిన్నది సాయంత్రానికి మరచిపోయేరకంరా మీరు. మా దండు పగలంతా పడుకుని సాయంత్రంవేళ లేచి రయ్యిన ఆడుతూ పాడుతూ వస్తుంటే హిట్ లూ, ఫట్లూ అంటూ స్ప్రేలు చల్లడంలేదూ, అంతేనా… మాకు గిట్టని వాసనలు గదుల్లోపెట్టి మమ్మల్ని లోపలకే రానివ్వకుండా చేయడంలేదూ. మాకు తలనొప్పి కలిగించే విద్యుత్ పౌనఃపున్యాలను ప్రసారంచేయించి మమ్మల్ని దారిమళ్లించడంలేదూ…పురుగుమందుతాగి రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే మీరు అంటే మీడియావాళ్లు గగ్గోలు పెడతారే, మరి నిత్యం మీరు జల్లే విషపు మందులకు దోమలమైన మేము లక్షలాదిమంది చనిపోతున్నాముకదా, మరి మమ్మల్ని ఎ్పపుడైనా పట్టించుకున్నారా? మా కష్టసుఖాలు మీ టీవీల్లో చూపించారా అని అడుగుతున్నాను. ఇప్పుడైనా ఎందుకు పిలిచారో మాకు తెలియదా… మామీద టెర్రరిస్టు అని ముద్రవేయడానికేకదా…
యాంకర్ : మా దృష్టిలో మీరు టెర్రరిస్టే. ఎంత జాగ్రత్తగా ఉన్నా, మా శాంతిభద్రతలను క్షణాల్లో ధ్వంసం చేస్తున్నారు. మా ఆరోగ్యం దెబ్బతీస్తున్నారు. మానవాళి నాశనమైపోతుందేమోనన్న భయం పట్టుకుంది. అలాంటప్పుడు మీరు ఉగ్రవాదులుకాకమరేంటీ…(చాలా ధైర్యంగా అడిగేశాడు యాంకర్)
దోమ: ఛత్..మళ్ళీ అదేమాట. చూడు నీకు అర్థంకావడంలేదు. మేము అంటే దోమలమెవరమూ టెర్రరిస్టులం కాదు. నువ్వు చెబుతున్న లక్షలాది మరణాలకు మేము ఎంతమాత్రం బాధ్యులంకాము. కావాలంటే సీబీఐ చేత విచారణ జరిపించు. అసలు విషయం వివరంగా చెబుతాను విను… మీకు రోగాలు వస్తున్నవి మావల్లకాదు, మాలోని సూక్షక్రిములవల్ల. ఈ ధర్మసూక్ష్మం తెలియక మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు. ఏ న్యాయస్థానానికి వెళ్ళినా ఈ ధర్మసూక్షమే నెగ్గుతుంది. ఇప్పుడు చెప్పు, మానవుల్ని చంపుతున్నది దోమలా, లేక సూక్ష్మక్రిములా…
యాంకర్ ; సూక్ష్మక్రిములే.
దోమ : మరి అలాంటప్పుడు టెర్రరిస్టులు ఎవరు
యాంకర్ : సూక్ష్మక్రిములే
దోమ: మరి దోమలో
యాంకర్ : టెర్రరిస్టులు కారు.
దోమ: అద్గదీ సంగతి. నువ్వే ఒప్పేసుకున్నావ్. మరి ఇకనేం, నీ షో టైటిల్ మార్చేసుకో… శాంతికాముకులు దోమలని మార్చేసుకో…నేనువస్తా…
(అంటూ రయ్యిన స్టూడియోనుంచి దోమగారు ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. యాంకర్ బిత్తరచూపులు చూస్తునేఉన్నాడు)
– కణ్వస