ఓటుకి నోటు కేసు మళ్ళీ వేగం పుంజుకోవడంతో సహజంగానే తెదేపా నేతల్లో గుబులు మొదలయింది. ఆ గుబులుతో వారు మీడియా ముందుకు వచ్చి ఎవరికీ తోచిన వాదన వారు చేస్తున్నారు. మంత్రి రావెల కిషోర్ బాబు “ఈ స్టింగ్ ఆపరేషన్లు, ఆడియో, వీడియో సాక్ష్యాలు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పిందని అయినా ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని” అన్నారు. అంటే ఓటుకి నోటు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పటికీ, ఏసిబి సమర్పించిన ఆడియో, వీడియో ఆధారాలని పరిగణనలోకి తీసుకోవడం తప్పని వాదిస్తున్నట్లుంది.
తెదేపా ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ కేసులో మరి కొన్ని సాంకేతిక అంశాలని బయటకి తీసి వాదించారు. సాధారణంగా ఇటువంటి కేసులని ఎన్నికల నిబంధనలని ఉల్లంఘించడంగా పరిగణించి కేసులు నమోదు చేస్తుంటారని కానీ రేవంత్ రెడ్డి తెరాస ప్రభుత్వంతో గట్టిగా యుద్ధం చేస్తుంనందునే అది ఆయనపై కక్ష కట్టి ఈ కేసులో ఇరికించిందని వాదించారు. తన వాదనలని సమర్ధించుకోవడానికి ఆయన ఇటువంటి రెండు మూడు కేసుల గురించి కూడా చెప్పారు. ఎన్నికల సమయంలో తెరాస నేతలు కొందరు రూ.18లక్షల నగదుతో పట్టుబడినప్పుడు, ఎన్నికల నియామావళిని ఉల్లంఘించినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి తరువాతః వారిని విడిచిపెట్టేశారని చెప్పారు. అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా ఈవిధంగా పట్టుబడినవారిపై సెక్షన్: 171 కింద నమోదు కేసులు నమోదు చేశారు తప్ప ఈవిధంగా ఏసిబితో కేసులు నమోదు చేయించలేదని సోమిరెడ్డి వాదించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఇరికించారని సోమిరెడ్డి ఆరోపించారు.
ఈ కేసులో మరొ రెండు సాంకేతిక అంశాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.1. ఈ కేసులో ఏసిబి నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్.లో కానీ చార్జ్ షీట్లో గానీ ఎక్కడా చంద్రబాబు నాయుడుని నిందితుడుగా పేర్కొననప్పుడు ఏసిబి న్యాయస్థానం ఏవిధంగా ఆయనని కూడా ప్రశ్నించేందుకు ఏసిబి అధికారులని అనుమతించింది? అని ప్రశ్నించారు. 2. ఈ కేసులో నాలుగవ నిందితుడుగా పేర్కొనబడిన జెరూసలెం మత్తయ్య సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఇంకా పెండింగులో ఉండగా ఏసిబి న్యాయస్థానం ఏవిధంగా ఈ కేసుపై పునర్విచారణకి ఆదేశిస్తుంది? అని ప్రశ్నించారు. ఏసిబి న్యాయస్థానం తన రాజ్యాంగ పరిధిని అతిక్రమించడం సరికాదని సోమిరెడ్డి వాదించారు.
ఈ కేసులో సోమిరెడ్డి, రావెల కిషోర్ బాబు వాదనలలో సాంకేతిక అంశాలని పక్కనబెట్టి, అసలు రేవంత్ రెడ్డి తెరాస నామినేటడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కి రూ.50 లక్షలు డబ్బు ఇవ్వడం నిజమా కాదా? అది తప్పా కాదా? అనే ప్రశ్నలకి నేరుగా సమాధానాలు చెపితే బాగుంటుంది. వాటి సమాధానాలు అందరికీ తెలుసు కనుక మళ్ళీ వాటిని తమ నోటితో చెప్పుకోనవసరం లేదు. చెప్పుకొంటే సిగ్గు చేటు కనుక చెప్పుకోలేరు. ఈ ఓటుకి నోటు కేసు గురించి వారు చేస్తున్న ఇటువంటి వాదనల వలన కూడా తెదేపాకి అంతే పరువు నష్టం జరుగుతోంది. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు తమని టార్గెట్ చేస్తున్నప్పుడు మౌనం వహిస్తే ఇంకా ఎక్కువ డ్యామేజి జరిగే ప్రమాదం ఉంది కనుక మాట్లాడక తప్పడంలేదు.