ప్రతీ కథానాయికకీ ఓ స్థాయి ఉంటుంది. పైగా స్టార్ హీరోయిన్లు అనిపించుకొంటున్నవాళ్లకు అది కచ్చితంగా ఉండి తీరాలి. ఏ హీరో తో నటిస్తున్నాం? దర్శకుడు ఎవరు? అనే విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ఓ సినిమా కోసం స్టార్ హీరోతో చిందులేసి, వెంటనే అప్పుడే బుడి బుడి అడుగులు వేస్తున్న బుల్లి హీరోతో చెట్టాపట్టాలేసేస్తే.. తన స్థాయి తనే తగ్గించుకొన్నట్టు. కానీ తమన్నా మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదు. డబ్బులొస్తే చాలు.. హీరో ఎవరైతే ఏంటి? అని రేంజులో రెచ్చిపోతోంది. ఈ మధ్య కాలంలో ఐటెమ్ పాటకు కేరాఫ్ అడ్రస్స్ గా నిలిచింది తమన్నా. అల్లుడుశీను కోసం బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలసి చిందేసింది. ఆ పాట కోసం ఏకంగా రూ.60 లక్షలు అందుకొంది. డబ్బుల కోసమే మరోసారి అతనితో ఐటెమ్ పాటలో ఆడిపాడింది. ఇప్పుడు జాగ్వార్ హీరో… నిఖిల్ కుమార్‌తో ఐటెమ్ పాట చేయడానికి రెడీ అయిపోయింది. ఈ పాట కోసం తక్కువలో తక్కువ కోటి రూపాయలు తీసుకొన్నట్టు టాక్. మరోవైపు చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150లో ఐటెమ్ పాట కోసం తమన్నాని సంప్రదిస్తున్నారు. ఓ వైపు మెగాస్టార్ సినిమాల్లో అవకాశాలొస్తున్నప్పుడు ఇలా డబ్బుల కోసం చిన్న చిన్న హీరోలతో ఆడిపాడేయడం ఏమిటన్నది ఎవ్వరికీ అర్థం కాని విషయం. హీరోయిన్ గా ఎవ్వరి కెరీర్ అయినా కొంత కాలమే.
తమన్నా కెరీర్ ఎంతకాదన్నా ఇంకో రెండు మూడేళ్ల వరకూ ఖాయంగా నడుస్తుంది. ఈలోగానే ఇలా ఐటెమ్ పాటల కోసం.. తన స్థాయి తాను కావాలని దిగజార్చుకొంటుందేమో అనిపిస్తోంది. కథనచ్చో, పాత్ర కు ఎట్రాక్ట్ అయ్యో చిన్న సినిమాలు చేస్తోందీ అంటే అదేం లేదు. కేవలం ఐదు నిమిషాల పాటలో ఇలా కనిపించి అలా మాయమైపోయే పాటల్ని ఎంచుకొంటుంది. తమన్నా ఎంత మనీ మైండెడ్‌గా ఆలోచిస్తుందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి??