ఓటుకి నోటు కేసు నుంచి విముక్తి కల్పించమని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు గురువారం హైకోర్టుని ఆశ్రయించారు. మధ్యాహ్నం భోజన విరామానికి ముందు ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఓటుకి నోటు కేసుని పునర్విచారణ జరిపి అవసరమైతే చంద్రబాబు నాయుడుని కూడా విచారించి నివేదిక సమర్పించాలని ఏసిబి కోర్టు ఆదేశించిన నేపధ్యంలో చంద్రబాబు నాయుడు ఈవిధంగా జాగ్రత్తపడ్డారు. తనపై విచారణని నిలిపివేయవలసిందిగా ఏసిబి కోర్టుని ఆదేశించాలని చంద్రబాబు నాయుడు తన పిటిషనులో కోరారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న జెరూసలెం మత్తయ్యపై ఏసిబి పెట్టిన కేసుని హైకోర్టు కొట్టివేసిందని కనుక తనపై ఏసిబి విచారణని నిలిపివేయాలని చంద్రబాబు నాయుడు తన పిటిషన్ లో అభ్యర్ధించారు.
ఒకవేళ ఆయన అభ్యర్ధనని హైకోర్టు మన్నిస్తే పరువాలేదు లేకుంటే వెంటనే సుప్రీంకోర్టుని ఆశ్రయించక తప్పదు లేకుంటే ఏసిబి అధికారులు ఏ క్షణంలో అయినా ఆయనకి నోటీసులు అందించే అవకాశం ఉంది.
ఈ కేసులో చంద్రబాబు నాయుడి ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న ఏసిబి అధికారులు గతంలోనే ఆయనకి స్వర పరీక్ష నిర్వహించాలనుకొన్నారు. కానీ ఆ తరువాత ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య రాజీ కుదరడంతో ఓటుకి నోటు, టెలీఫోన్ ట్యాపింగ్ కేసులు అటకెక్కిపోయాయి. మళ్ళీ ఇన్నాళ్ళకి వైకాపా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కోర్టులో రివ్యూ పిటిషన్ వేయడంతో ఈ కేసులో మళ్ళీ కదలిక వచ్చింది. తప్పనిసరి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు హైకోర్టుని ఆశ్రయించవలసి వచ్చింది. మరికొద్ది సేపటిలో హైకోర్టు ఆయన పిటిషన్ పై విచారణ చేసి తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఏసిబి కోర్టు నుంచి నోటీసులు అందుకొన్న రేవంత్ రెడ్డి, ఉదయ సింహ, సెబాస్టియన్ ముగ్గురూ కూడా హైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది.
తాజా సమాచారం: చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్ పై విచారణని హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.