గ్యారేజ్ కథను రెండేళ్ళ క్రితమే విన్నాను, అప్పటి నుంచీ ఈ కథ నన్ను హాంట్ చేస్తూ వచ్చిందని ఎన్టీఆర్ ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. కొరటాల శివ వెర్షన్ కూడా డిటో. కానీ వీళ్ళిద్దరూ కూడా కబాలి సినిమాను ఓ సారి స్టడీ చేసి ఉంటే గ్యారేజ్ రిజల్ట్ ఇంకాస్త బెటర్‌గా ఉండేది. ఈ రెండు సినిమాలకు చాలా చాలా సారూప్యత ఉంది.
కబాలిలో ఓల్డ్ డాన్‌గా రజినీ కనిపించబోతున్నారు అని తెలియగానే ఆయన అభిమానులందరూ కూడా రజినీ కెరీర్‌ని మలుపు తిప్పిన ‘భాషా’ స్థాయి సినిమాని ఎక్స్పెక్ట్ చేశారు. జనతా గ్యారేజ్ విషయంలో కూడా అదే జరిగింది. చాలా కాలం తర్వాత కొరటాల శివలాంటి మాస్ డైరెక్టర్‌తో కలిసి ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు అనగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సింహాద్రి స్థాయి రిజల్ట్‌ని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రిలీజ్ దగ్గర పడే టైంకి రెండు సినిమాల ప్రమోషన్స్ కూడా ఒకేలా టర్న్ తీసుకున్నాయి. ఇద్దరూ కూడా ఇదో గొప్ప కుటుంబ కథా చిత్రమనే పాట అందుకున్నారు. అయినప్పటికీ మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగానే ఉండి ఉంటాయి అని సినిమాకు వెళ్ళిన వాళ్ళను రెండు సినిమాలు కూడా డిసప్పాయింట్ చేశాయి.
ఓల్డ్ డాన్‌గా కబాలి చేసే హంగామా చూద్దామని వెళ్ళిన వాళ్ళకు భార్యను వెతుక్కుంటూ తిరిగే ముసలి డాన్ కథను చూపించాడు రంజిత్. ఇప్పుడు జనతా గ్యారేజ్ కూడా సేం టు సేం. హై ఎండ్ యాక్షన్ ఎంటర్టైనర్ని ఎక్స్పెక్ట్ చేసి గ్యారేజ్‌కి వెళితే మనం చాలా సార్లు చూసేసిన గొప్ప సీరియల్ కుటుంబ కథా చిత్రాన్ని మన ముందుంచాడు కొరటాల. అదే సినిమాకు చాలా మైనస్ అయింది. సమంతా, నిత్యామీనన్‌లాంటి ఇద్దరు టాలెంటెడ్ హీరోయిన్స్‌కి స్కోప్ లేకుండా చేసింది. ఈ కుటుంబ కథా చిత్రాన్ని కాస్త తగ్గించి లవ్ స్టోరీ పైన కాన్సన్ట్రేట్ చేసి ఉన్నా జనతా గ్యారేజ్ ఇంకొంచెం బెటర్‌గా ఉండేదేమో. జనతా గ్యారేజ్ టైటిల్, ఇచ్చట అన్నీ రిపేర్లు చేయబడును అన్న పవర్ఫుల్ క్యాప్షన్ చూసి బీభత్సమైన విలనీ, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేసినవాళ్ళను పూర్తిగా నిరాశపరిచాడు కొరటాల. ఓ సిల్లీ క్లైమాక్స్ సీన్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యేలా చేశాడు. ఎన్టీఆర్, మోహన్‌లాల్‌ల స్థాయికి తగ్గ విలన్ లేకపోవడం చాలా పెద్ద మైనస్ అయింది.
కబాలి సినిమాలో కూడా సేం మిస్టేక్ చేశారు. విలన్ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ రజినీకాంత్ ముందు తేలిపోయాడు. ఇప్పుడు జనతాలో కూడా ఎన్టీఆర్, మోహన్‌లాల్ క్యారెక్టర్స్ వరకూ కరెక్ట్‌గానే ప్లాన్ చేసుకున్న శివ….విలన్ క్యారెక్టర్ పైన మాత్రం కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇవన్నీ పరిశీలిస్తున్నవాళ్ళకు వస్తున్న సందేహం ఒక్కటే. రెండేళ్ళ క్రితం కథ తయారు చేసుకోవడం అన్న విషయం పక్కన పెడితే ‘కబాలి’ సినిమాను చూశాక అయినా గ్యారేజ్‌కి రిపేర్లు చేసి ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది కదా? అని.