ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణా హోం కార్యదర్శి రాజీవ్ త్రివేదికి ఆంద్రప్రదేశ్ సిట్ అధికారులు నోటీసు ఇవ్వబోతున్నారు అని నిన్న వార్తలు వచ్చాయి. ఆయనకి నోటీసు ఇచ్చారు, కానీ అది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనని విచారించేందుకు కాదు. ఆయన వద్ద ఉన్న కాల్-డాటా రికార్డులను జాగ్రత్తగా భద్రపరచమని కోరుతూ విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆయనకు అందించదానికి మాత్రమే. సిట్ అధికారులు కోర్టు ద్వారా పొందిన ఆ ఆదేశాన్ని నిన్న సాయంత్రం ఆయనకు అందించి తిరిగి వచ్చేసారు. అంతే!కానీ ఆయనకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వబోతున్నారు అంటూ సంబంధిత అధికారులు సగం నిజం దాచిపెట్టి మీడియాకి ఇచ్చిన లీక్ వలన ఆయనను విచారించేందుకే నోటీసు ఇవ్వబోతున్నారు అని మీడియాలో ప్రచారం అయ్యేలా చేయగలిగారు. ఎసిబి అధికారులు తెదేపాతో సంబంధం ఉన్నవారిని ఎవరినో ఒకరిని ఎంచుకొని ఓటుకి నోటు కేసులో నోటీసులు ఇస్తూ తెదేపా నేతల్లోఏవిధంగా గుబులు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారో, ఏపి సిట్ అధికారులు కూడా ఈవిధంగా ఒకసారి టీ-న్యూస్ ఛానల్ కార్యాలయానికి, ఇంకోసారి మంత్రి కేటీఆర్ ఇంటికి మళ్ళీ ఇప్పుడు ఏకంగా తెలంగాణా హోంశాఖ కార్యదర్శి వద్దకు వెళ్ళడం ద్వారా తెరాస నేతలకు కూడా గుబులు పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.కానీ తెదేపా, తెరాస ప్రభుత్వాలు రెండూ కూడా ఈ కేసుల్లో అడుగుముందుకు వేయలేవని ప్రజలకు కూడా ఇప్పుడు అర్ధం అయ్యింది.