ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కేంద్రప్రభుత్వానికి మధ్య జోరుగా బేరసారాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తే ఎంత నిధులు ఇస్తుందో, ప్యాకేజిలో కూడా అంతా ఇస్తేనే అంగీకరిస్తామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అదేవిధంగా రైల్వేజోన్ తో సహా మిగిలిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలుచేయాలని ముఖ్యమంత్రి పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కేంద్రప్రభుత్వం అందుకు అంగీకరిస్తే ఆయన రేపే డిల్లీ వెళ్లి అన్నీ ఫైనల్ చేసే అవకాశం ఉంది.
గత రెండేళ్లుగా ప్రత్యేక హోదా, ఇతర హామీలు, నిధుల విడుదల విషయంలో చాలా కటువుగా వ్యవహరించిన కేంద్రప్రభుత్వం, కారణాలు ఏవైతేనేమి, ఇప్పుడు తనే స్వయంగా దిగివచ్చి ప్యాకేజి గురించి మాట్లాడుతోంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టువిడుపులు ప్రదర్శించుతూ రాష్ట్రానికి మేలు కలిగే విధంగా మాట్లాడుకొని ప్యాకేజిని స్వీకరించడమే మంచిది. ప్రత్యేక హోదా తప్ప ప్యాకేజీకి అంగీకరించబోమనే ప్రతిపక్షాల బెదిరింపులకి భయపడనవసరం లేదు. వాటికి భయపడి ఇప్పుడు వెనక్కి తగ్గితే తెదేపా-భాజపాల మధ్య తెగతెంపులు చేసుకోవలసి వస్తుంది. అప్పుడు ఆ రెండు పార్టీలు ఇంకా బలహీనపడి నష్టపోతాయి. రాష్ట్రం కూడా తీవ్రంగా నష్టపోపోతుంది. గత రెండేళ్లుగా కేంద్రప్రభుత్వం మొండి వైఖరి చూసి రాష్ట్రానికి ఇక ఏమీ రాదని అందరూ అనుకొంటున్న సమయంలో ఈ ప్యాకేజి వస్తోంది. కనుక ప్రజలు దానికి తప్పకుండా సంతోషిస్తారే తప్ప వద్దనుకోరు. కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్యాకేజీని తీసుకోవడమే అన్ని విధాల మంచిది.
తరువాత ప్రతిపక్షాలని ఎదుర్కోవడానికి తెదేపా, భాజపా మంత్రులు, నేతలు అందరూ కలిసి ప్రజలకి నచ్చచెప్పుకోగలిగితే సరిపోతుంది. కానీ కేంద్రం ఇస్తున్న నిధులని తెదేపా ప్రభుత్వం చాలా దుబారా చేస్తోందని ప్రతిపక్షాలే కాదు మిత్రపక్షమైన భాజపా, ప్రజలు కూడా అనుకొంటున్నారు. కనుకనే వారు ప్యాకేజిలని వ్యతిరేకిస్తున్నారు. కనుక కేంద్రప్రభుత్వం ఇవ్వబోయే ఆర్ధిక ప్యాకేజిలో ప్రతీ పైసాని సద్వినియోగం చేసి మిగిలిన ఈ రెండున్నరేళ్ళలో రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేసి చూపవలసిన బాద్యత తెదేపాపైనే ఉంది. లేకుంటే ప్యాకేజీ సాధించినా తెదేపాకి ఇచ్చినందుకు భాజపాకి వచ్చే ఎన్నికలలో ఎటువంటి రాజకీయ లబ్ది కలుగదు. ఈ ప్యాకేజి రాష్ట్రానికి ఆ రెండు పార్టీలకి కూడా నిజంగానే సంజీవంటి వంటిదే. దానిని సద్వినియోగపరుచుకోవడంలోనే వాటి విజ్ఞత కనబడుతుంది.