ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా నిరాకరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంటే దానికి ఏవేవో అందమైన పూతలు పూసి ప్రజలతో మింగించేందుకు కొన్ని మీడియా సంస్థలు తంటాలు పడుతున్నాయి. మనం నిస్సహాయులం అన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతుంటే ఆయన ఆఖరి అస్త్రం ప్రయోగించి ఫలితం సాధించారని పొగడ్తలు గుప్పిస్తున్నాయి. దీనిపై ఉదయం ఎన్‌టివిలో చర్చ జరిగింది. బిజెపి ప్రతినిధి కేంద్రాన్ని సమర్థించేందుకు బాగా శ్రమ పడ్డారు. అయినా నిర్దిష్టంగా చెప్పిందేమీ లేదు. సాయింత్రం కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపిలు ఒక మీడియా గోష్టి నిర్వహించి చాలాసేపు మాట్లాడారు. అందులోనూ స్పష్టంగా చెప్పింది లేదు.
కొత్తగా ఏదో చెప్పడానికి పిలవలేదని సుజనా అన్నారు. ఆయన ప్రస్తావించిన చాలా అంశాల్లో వర్కవుట్ చేస్తున్నారని, వారం రోజుల్లో తేలుతుందని గడువు తీసుకున్నారు. రెవెన్యూ లోటు అయినా, ప్రత్యేక హౌదా స్థాయిలో ఇవ్వదల్చుకున్న నిధులైనా అన్ని వర్కవుటవుతున్నాయి. హౌదా రాకపోవచ్చన్నది ఆయన మాటల్లో సూచనగా వుంది. రాజీలేని పోరాటం చేస్తామంటూనే రాజీ అనివార్యమని చెప్పకనే చెప్పారు. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడదది ఇందుకు కారణమై వుండొచ్చు. ఎంపిలు ఏమీ చేయడం లేదన్న పవన్ కళ్యాణ్‌కు సమాధానమివ్వాలన్న ఆలోచనా కావచ్చు. ఏదైతేనేం- కొత్తగా తెలిసింది లేదు, వచ్చేదీ వున్నట్టు లేదు. నేను టీవీ చర్చలో అన్నట్టు కుడి ఎడమైతే పోరబాటు లేదోరు!