జనతా గ్యారేజ్ తొలి రోజు లెక్కలు బయటకు వస్తున్నాయి. అనుకొన్నట్టే తొలిరోజు బాక్సాఫీసుని షేక్ చేసింది జనతా గ్యారేజ్. రెండు తెలుగు రాష్ట్రాలలో కలసి రూ.21 కోట్ల షేర్ వసూలుచేసినట్టు చిత్రబృందం ప్రకటించింది. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతో కలసి 560000 డాలర్లు సాధించింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇది రికార్డు. ఓవరాల్‌గా చూస్తే మూడో స్థానంలో నిలిచినట్టు. తొలి రెండు స్థానాలలో సర్దార్ గబ్బర్‌సింగ్, బాహుబలి సినిమాలున్నాయి. జిల్లాల వారిగా చూస్తే…కృష్ణ, గుంటూరు, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరిల్లో జనతా ప్రభంజనం సృష్టిస్తోంది. అక్కడ మాత్రం ఆల్ టైమ్ రికార్డులన్నీబ్రేక్ చేయగలిగింది జనతా గ్యారేజ్. మిగిలిన ఏరియాల్లో 2 లేదంటే 3వ స్థానంలో కొనసాగుతోంది.
తొలిరోజు కనీసం రూ.20 కోట్లు సాధించాలన్నది జనతా గ్యారేజ్ టార్గెట్. దాన్ని అలవోకగా అందుకొంది. అయితే సర్దార్ గబ్బర్‌సింగ్ రికార్డుని మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. శుక్రవారం వసూళ్ల తాకిడి కాస్త తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మల్టీప్లెక్స్ లు మాత్రం ఫుల్స్ అవుతున్నాయి. శని, ఆది వారాల లెక్కల్ని బట్టి జనతా గ్యారేజ్ రేంజ్ డిసైడ్ అవ్వనుంది.