మన విద్యా విధానంలో లోపం ఉందట, సమాజంలో చైతన్యం రావాలట, ఇంజినీరింగ్ పూర్తి చేసినవారు అటెండర్లుగా పనిచేస్తున్నారట, విద్యను వ్యాపారం చేశారట, సరస్వతీదేవిని లక్ష్మీదేవిగా మార్చారట, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలట……అన్నీ అమూల్యమైన వాక్కులే కదా. ఈ మాటలన్నీ మన గవర్నర్ నరసింహన్‌గారు చెప్పారు. ఇంత గొప్ప మాటలు మాట్లాడిన గవర్నర్‌ని ప్రశంసిస్తూ మీడియా కూడా తన బాధ్యతను నెరవేరుస్తుంది. విద్యకు సంబంధించిన టీచర్స్ దినోత్సవం లాంటివి వచ్చినప్పుడల్లా రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల వరకూ అందరూ ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. అత్యంత దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే గత కొన్ని దశాబ్ధాలుగా జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విమర్శకులు, పండితులు….ఆ మాటకొస్తే పామర జనాలు కూడా మన విద్యావ్యస్థ గురించి చెప్తూ ఉన్నది ఇదే. చదువుకోని వాళ్ళకు కూడా మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటో చాలా స్పష్టంగా తెలిసిపోయాయి. దేశంలోనే అత్యంత ఎక్కువ మంది, అత్యంత ఎక్కువ సార్లు డిస్కస్ చేసిన విషయం కూడా ఇదే అయి ఉంటుంది.
అధికారంలో ఉన్నవాళ్ళకు ఎన్ని సార్లు, ఎన్ని రకాల నివేదికలు ఇచ్చారన్నదానికి లెక్కేలేదు. కానీ మన పాలకులు మాత్రం విద్యావ్యస్థకు వీసమెత్తు ప్రాధాన్యత కూడా ఇవ్వరు. అసలు విద్యను వ్యాపారమయం చేసిందే మన రాజకీయ రాబందులు. మళ్ళీ వాళ్ళే కుర్చీ ఎక్కగానే కమ్మని కహానీలు చెప్తూ ఉంటారు. ఆర్థికంగా మనకంటే చాలా చాలా తక్కువ స్థాయిలో ఉన్న దేశాలు కేటాయించినన్ని నిధులు కూడా పొద్దస్తమానం విజన్ గురించి మాట్లాడే మన పాలకులు విద్యాభివృధ్ధి కోసం ఖర్చుచేయలేరు. పొద్దున్న లేస్తే యువతే మా ప్రాణం. యువతదే భవిష్యత్తు. భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి యువత కీలక పాత్ర పోషించాలి….లాంటి డైలాగులు కొట్టని పొలిటీషియన్ ఎవరూ ఉండరు. మన యువత పైన పాలకులకు ఎంతటి నమ్మకమో హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుగాంచిన చంద్రబాబు మాటల్లోనే బయటపడింది. ఇక్కడి ఇంజినీర్లను నమ్ముకుంటే స్లమ్ సిటీలను నిర్మించుకోవాల్సిందే అన్న అర్థం వచ్చేలా మాట్లాడేశారాయన. తెలుగు రాష్ట్రాల్లో విద్యను అత్యంత ఎక్కువగా వ్యాపారమయం చేసిన ఘనుడు ఆయన మంత్రి వర్గంలోనే మంత్రిగా కొనసాగుతున్నారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రిగా ఆయన పేరు వినిపించినప్పుడే పాలకులందరూ కూడా సిగ్గుపడాలి. కానీ మన నాయకుల నుంచి అలాంటివి ఆశించలేం.
ఇప్పటికే కొన్ని జెనరేషన్స్ విద్యార్థులు చాలా నష్టపోయారు. మరుసటి రోజు న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్‌లో రావడం కోసం, టివి వార్తల్లో గొప్పగా కనిపించడం కోసం కహానీలు చెప్పడం మానుకొని విద్యావ్యవస్థను గాడిన పెట్టే ప్రక్రియను ప్రారంభిస్తే బాగుంటుంది. దొంగతనాలు, రేప్‌లు, మర్డర్లు…ఇంకా ఎన్నో అసాంఘిక కార్యకలాపాల్లో పట్టభద్రులైన యువకుల పేర్లు వినిపిస్తూ ఉంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తేటతెల్లమౌతోంది. దేశాన్ని, రాష్ట్రాలను ఏదో చేసేస్తామని సొల్లు పురాణం వినిపిస్తున్న మన పాలకులు విద్యావ్యవస్థ విషయంలో ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే మాత్రం భరతమాత బిడ్డలు భయం గుప్పిట్లో, భయంకరమైన పరిస్థితుల మధ్య బ్రతకాల్సిన పరిస్థితులు అనతి కాలంలోనే మన కళ్ళముందు నిలుస్తాయనడలో సందేహం లేదు.