జనతా గ్యారేజీ విడుదలైన తర్వాత కనిపిస్తున్న మిశ్రమ ఫలితాలు వూహించనివేమీ కాదు. మార్కెట్ వున్న దర్శకులు ఎవరికి వారే ఒక బ్రాండ్ వేసుకుని ఇమేజి వున్న ఒక హీరోకు తమ బ్రాండ్‌ను అద్దేసినంత మాత్రాన అఖండ విజయాలు చేకూరవు. నిజానికి మొదట్లోనే నేను ఈ తరహా సూచన చేశాను. కొరటాల శివ మొదటి రెండు చిత్రాల్లో ముఖ్యంగా రెండో చిత్రం శ్రీమంతుడులో కథాపరమైన బలహీనతలనూ పాత్రల డొల్లతనాన్ని విశ్లేషించాను. మన దర్శకులు ప్రతిభావంతులైనా ఒక జానర్ అంటూ పట్టుకుని దాన్ని అటూ ఇటూ తిప్పి విజయాలు వచ్చేస్తుంటాయని ఆశించడం లేదా రాలేదని బాధపడటం వల్ల ఉపయోగం వుండదు. బాహుబలిగా మారిన తెలుగు చిత్ర పరిశ్రమనూ ప్రేక్షకాభిరుచిని గట్టిగా పరిశీలించాలి. కామెడీ అంటే ఏదైనా చూసేస్తారు. అది కూడా ఒకో దర్శకుడికి హీరోకు రెండు మూడు చిత్రాలు. సీరియస్ ముద్ర వేసుకుని రొటీన్ స్టఫ్ లేదా డిస్జాయింటెడ్ స్టఫ్ ఇస్తే హర్షించరు.కనీసం ఊపిరి, బాబు బంగారం వంటి సినిమాల్లో వలె ఏకసూత్రతైనా వుండాలి.రాజమౌలి జనతా గ్యారేజి రెండు సార్టు చూశానని ట్వీట్ చేయడం వంటివి కూడా పెద్దగా తోడ్పడవు. ఆయన ఇతరులను ప్రోత్సహించడానికి ఈ మధ్య తరచూ ఇలాటివి చేస్తున్నారు గాని పరస్పర ప్రశంసల వల్ల ఫలితం వుండదు. చంద్రశేఖర్ ఏలేటి చాలా భిన్నమైన దర్శకుడు. అనుకోకుండా ఒకరోజు నాకు చాలా ఇష్టమైన సినిమా. అయితే మనమంతా అనుకున్న ఫలితం తీసుకురాలేదు. ఆయనను కూడా రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. నాలుగు కథలను కలపడం పెద్ద విశేషమైనట్టు ఆ సంభాషణ నడిచింది. చిత్ర ప్రచారంలోనూ అదే ముఖ్యమైన పాయింటుగా చేసుకున్నారు. నిజంగా అదంతా అసాధారణమా? మన సినిమాల్లో పాత్రలన్నిటికి ఏవో కథలుంటాయి. కాకపోతే ఒకరి పరంగా చెప్పడం వల్ల మిగిలినవి వెనక్కు పోతుంటాయి. ఇదే దర్శకుడు గతంలో తీసిన ఐతే, అనుకోకుండా ఒకరోజు వంటివి కూడా కథల కలయికలే. రాజమౌలి వంటి వారు ఒకే ఎమోషనల్ పాయింట్ తీసుకుని కథ అల్లేస్తారు. అవసరమైతే జన్మలనూ తరాలను కూడా మార్చి చెబుతుంటారు. మగధీర బాహుబలి రెండు సెట్టింగులతో నడిచే కథలే. మొత్తానికి తెలుగు సినిమాలు కొన్నిటికి వసూళ్లు పెరిగి పారితోషికాలు ప్రచార యంత్రాంగం పెరిగి వుండొచ్చు గాని కథల్లో చిక్కదనం తగ్గుతున్నదనేది నిజం. పాత్రలు గాక నటులే కనిపిస్తున్నారు. ప్రచారం కూడా ఆ చుట్టూనే తిరుగుతున్నది. ఈ మూసనుంచి ఎంత త్వరగా బయిటపడితే అంత మంచిది.