ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు తుని విద్వంసం కేసులో నిన్న వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డితో సహా 20 మందికి నోటీసులు జారీ చేశారు. వారిందరినీ ఈ నెల 4వ తేదీన రాజమండ్రి, గుంటూరులో గల సిఐడి కార్యాలయంలో విచారణకి హాజరుకమ్మని నోటీసులలో కోరారు. కరుణాకర్ రెడ్డికి ఆరోజు వేరే పనులు ఉన్నందున సెప్టెంబర్ 6న విచారణకి హాజరయ్యేందుకు సిఐడి అనుమతి తీసుకొన్నారు.
కాపులకి రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో ఆయన ఈనెల 11న రాజమండ్రిలో రాష్ట్రంలో కాపు సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో వారితో చర్చించి తమ భవిష్య కార్యాచరణ ప్రకటిస్తానని ముద్రగడ చెప్పారు. ఆయన మళ్ళీ ఉద్యమానికి సిద్దం అవుతున్న సమయంలో సిఐడి పోలీసులు తుని విద్వంసం కేసులో 20మందికి నోటీసులు జారీ చేసి వారిని అరెస్ట్ చేస్తే ఆయన ఇదివరకులాగే వారిని విడిపించుకోవడానికే నిరాహార దీక్ష చేయవలసి రావచ్చు. అదే జరిగితే మళ్ళీ ఆయన పోరాటం పక్కదారి పడుతుంది. బహుశః ఆవిధంగా జరగాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ ఎత్తు వేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నోటీసులపై ఆయన ఇంకా స్పందించవలసి ఉంది.
ఒకవేళ ఈసారి కూడా ఆయన వారిని విడిపించుకోవడానికే నిరాహార దీక్షకి కూర్చొన్నట్లయితే, ఇక నుంచి ఆయన ఎప్పుడు పోరాటానికి సిద్దం అయినా సిఐడి పోలీసులు తుని విద్వంసం కేసులో అనుమానితులని అరెస్ట్ చేస్తుంటారు. కనుక ఆయన ఇక ఎన్నటికీ కాపులకి రిజర్వేషన్లు కోసం పోరాడలేకపోవచ్చు. బహుశః ఆయన కూడా ఈ విషయం గ్రహించే ఉంటారు కనుక ఈసారి ప్రభుత్వం పన్నిన ఆ ఉచ్చులో చిక్కుకోకుండా తన ఉద్యమాన్ని చేపడతారా లేదో చూడాలి.