ఇవ్వాళ్ళ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ భాజపా విస్త్రుతస్థాయి సమావేశం జరుగబోతోంది. దానికి రాష్ట్ర నేతలతో బాటు అ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ కూడా హాజరు కాబోతున్నారు. రెండు రోజుల క్రితమే కేంద్రప్రభుత్వం ఏపికి ఇవ్వదలచుకొన్నదేమిటో ముఖ్యమంత్రికి తెలియజేసింది. ఏపికి ప్రత్యేక హోదాతో కూడిన ప్యాకేజిని మాత్రమే అంగీకరిస్తామని లేకుంటే భాజపాతో తెగతెంపులకి సిద్దమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం తన డిమాండ్లకి అంగీకరిస్తేనే వాటిపై మాట్లాడుకొనేందుకు డిల్లీ వస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఆయన ఇంతవరకు డిల్లీ బయలుదేరకపోవడం గమనిస్తే చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడినట్లు అనుమానం కలుగుతోంది. ఈ నేపధ్యంలో హడావుడిగా భాజపా ఈ విస్త్రుతస్థాయి సమావేశం నిర్వహిస్తుండటంతో దానికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఒకవేళ తెదేపా భాజపాతో తెగతెంపులకి సిద్దం అయినట్లయితే భాజపా తన భవిష్య కార్యాచరణ రూపొందించుకోవలసి ఉంటుంది కనుక అందుకే ఈ సమావేశం జరుగుతోందా? అనే అనుమానం కలుగుతోంది.
ఒకవేళ ప్రత్యేక హోదా లేకుండా కేంద్రప్రభుత్వం ఇవ్వబోయే ప్యాకేజిని ముఖ్యమంత్రి స్వీకరించడానికి సిద్దపడితే తెదేపా-భాజపాల బంధం యధాతధంగా నిలిచి ఉంటుంది. కానీ అప్పుడు ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలని ఎదుర్కోవలసి ఉంటుంది. వాటిని ఎదుర్కొంటూనే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా రాష్ట్రానికి అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా నిధులు, రాయితీలు వగైరా వస్తాయని ప్రజలకి నచ్చ జెప్పుకోవలసి ఉంటుంది. బహుశః ఆవిషయం కూడా ఈ సమావేశంలో చర్చించవచ్చు.
ఇక రాష్ట్ర భాజపా అధ్యక్షుడి నియామకంపై ఇంతవరకు ఆ పార్టీ నిర్ణయం తీసుకోలేకపోతోంది. అందుకు కారణం తెదేపాతో తమ పార్టీ సంబంధాలపై భాజపాకి స్పష్టత లేకపోవడమేనని చెప్పక తప్పదు. నేటికీ అదే పరిస్థితి నెలకొని ఉంది కనుక ఈ సమావేశంలో కూడా దానిపై తగిన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న చర్చల నేపధ్యంలో ఈ సమావేశం జరుగుతోంది కనుక దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సమావేశంలో భాజపా ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకొంటుందా లేదో చూడాలి.