హైదరాబాద్: మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం నేతలు అడ్డం తిరిగినట్లు కనబడుతోంది. అమరావతి నిర్మాణానికి భూసేకరణపై ఏపీ ప్రభుత్వానికి సూచనలు చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు సమాధానాలు చెప్పనవసరంలేదని తెలుగుదేశం ఎంపీ ఒకరు కటువుగా వ్యాఖ్యానించారు. మరి ఇది ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యా, లేక పార్టీ నాయకత్వం అనుమతితోనే చేసినదా అనేది ఇంకా తెలియలేదు. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతాంగం దగ్గరకు వెళ్ళి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ప్రయోజనమేమిటని అడిగారు.
మరోవైపు పవన్ సహా ఎవరు పర్యటనకు వచ్చినా తాము సహకరిస్తామని, వచ్చి చూసుకోవచ్చని మంత్రి నారాయణ అన్నారు. పవన్ అంటే తమకు అభిమానం, గౌరవం అని, ఆయన మాటలను తాము వ్యతిరేకించబోమని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చెప్పారు.
పవన్ సూచనలపై యనమల నిన్న వ్యంగ్యంగా వ్యాఖ్యానించటం, దానిపై పవన్ తీవ్రంగా స్పందించటం, అమరావతి ప్రాంతంలో పర్యటిస్తానని అనటం తెలిసిందే. తాజాగా నిమ్మల కిష్టప్ప వ్యాఖ్యలు, ఇవాళ్టినుంచి జరుగుతున్న భూసేకరణ నేపథ్యంలో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు పెరిగేటట్లు కనిపిస్తున్నాయి.