హైదరాబాదీ సంచలనం సైనా నెహ్వాల్ సత్తా ఏంతో ప్రపంచానికి మరోసారి తెలిసివచ్చింది. గత వారం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఓడినప్పటికీ, సైనా ప్రపంచ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ఫైనల్లో తనను ఓడించిన స్పెయిన అమ్మాయి కరోలినా కంటే ఎక్కువ పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది.
కరోలినా 80,612 పాయింట్లు పొందింది. సైనా 82,792 పాయింట్లు సాధించింది. సైనా నెహ్వాల్ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోవడం ఇది రెండోసారి. గత మార్చిలో తొలిసారిగా నెంబర్ వన్ ర్యాంకు సాధించింది. అయితే కొద్ది రోజుల్లోనే చేజార్చుకుని రెండో ర్యాంకుకు పడిపోయింది.
ఇటీవల టోర్నీ ఫైనల్లో ఓడిన తర్వాత ఇప్పట్లో నెంబర్ వన్ కాదేమో అని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే, గత కొంతకాలంగా వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన సైనా, ఓవరాల్ ప్రద్శనన విషయంలో కరోలినా కంటే ముందంజలో నిలిచింది. అదే ఆమెకు అనుకూలాంశంగా మారింది. నెంబర్ బన్ ర్యాంకు కట్టబెట్టింది.
ఇక పురుషుల విభాగంలో శ్రీకాంత్ ర్యాంకు స్వల్పంగా తగ్గింది. ఒక ర్యాంకు కోల్పోయి నాలుగో స్థానానికి చేరాడు. మరోవైపు, మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు ప్రపంచ ర్యాంకింగ్స్ లో కాస్త వెనుకబడింది. ఇప్పటి వరకు 13వ ర్యాంకులో ఉన్న సింధు, 14 స్థానానికి చేరింది. డబుల్స్ విభాగంగా గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడీ పదో ర్యాంకు సాధించింది.
భారతీయ క్రీడాకారులు, ముఖ్యంగా హైదరాబాదీలు బ్మాడ్మింటన్ లో తమదైన ముద్ర వేస్తున్నారు. ర్యాంకు విషయంలో కాస్త హెచ్చుతగ్గులున్నా, దేశం మొత్తం మీద ఈ క్రీడకు వీరే ప్రస్తుతానికి అసలైన భారతీయ ప్రతినిధులుగా సత్తా చాటుతున్నారు.