కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కొన్ని రుల క్రితమే తెరాస కండువా కప్పుకొన్న మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ని తెలంగాణా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకి నేరుగా మంత్రి పదవి ఇవ్వకపోయినా ఈ పదవి ద్వారా క్యాబినెట్ హోదా కల్పించింది. తనకి ఆ పదవి ఇచ్చి గౌరవించినందుకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం, ఆ ప్రయత్నంలో ఎదురవుతున్న అనేక సమస్యల పరిష్కారం కోసం తన శక్తిమేర రాష్ట్ర ప్రభుత్వానికి సహాయపడతానని అయన అన్నారు.
ఇదంతా వినడానికి చాలా బాగానే ఉంది. కానీ కేసీఆర్ కి డి. శ్రీనివాస్ సలహాలు అవసరమా? ఒకవేళ ఆయన సలహా ఇచ్చినా ఆయన పట్టించుకొంటారా? అంటే అనుమానమే. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరేందుకు ఏదో ఒక పదవి ఇస్తానని హామీ ఇచ్చినందునో లేక ఇవ్వక తప్పదనే ఆలోచనతోనో ఆయనకు ఆ పదవి ఇచ్చి ఉండవచ్చు తప్ప నిజంగా ఆయన సలహాలు ప్రభుత్వానికి అవసరమని అనుకోలేము. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఇదే మొదటిసారి అయినప్పటికీ చాలా అనుభవం ఉన్న వ్యక్తిలాగా పరిపాలన సాగిస్తూ, ప్రతిపక్షాలతో ఒక ఆటాడుకొంటున్నారు. అయన ధాటికి కొమ్ములు తిరిగిన మహామహా కాంగ్రెస్ నేతలే తట్టుకోలేకపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ డి. శ్రీనివాస్ వంటి సీనియర్ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు తప్ప వారు లేకపోతే తను పరిపాలన చేయలేకకాదని అందరికీ తెలుసు. కనుక డీ శ్రీనివాస్ ని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించడం ఆయనకు పెద్ద విశేషం, గౌరవం కావచ్చు. కానీ కేసీఆర్ కి ఆయన సలహాలు అవసరమే లేదు. ఒకవేళ సలహాలు చెప్పాలని ప్రయత్నిస్తే భంగపాటు కూడా తప్పకపోవచ్చును. కనుక డీ.శ్రీనివాస్ తన పదవి ద్వారా దక్కే క్యాబినెట్ హోదాని హాయిగా ఆస్వాదించుకొంటూ కాలక్షేపం చేసుకోవడమే మంచిది. ఈ విషయంలో ఆయనకీ ఏమయినా డౌట్స్ ఉంటే ఇంతకు ముందు తెరాసలో చేరి మౌన వ్రతం అలవాటు చేసుకొన్న కే. కేశవరావు వంటి కాంగ్రెస్ నేతల సారీ తెరాస నేతల సంప్రదిస్తే ఇంకా మంచిది.