హైదరాబాద్: పార్లమెంట్‌లో ఏ విషయంపైనైనా ఆచి తూచి, పూర్తిగా అధ్యయనం చేశాకే మాట్లాడతానని, తన ప్రతిభ, వాక్చాతుర్యంచూసి ప్రతిపక్షాల సభ్యులుకూడా తాను మంత్రి అవ్వాలని ఆకాంక్షిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. వారి అదృష్టం బాగుండి మంత్రి పదవివస్తే చూద్దామని అని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి తమపార్టీ అంశాలవారీగా మద్దతిస్తోందని చెప్పారు. బీజేపీకి టీఆర్ఎస్ మిత్రపక్షమూకాదు, ప్రతిపక్షమూ కాదని అన్నారు. కేంద్రం తెలంగాణకు సరిగా మద్దతివ్వటంలేదని ఆరోపించారు. ప్రతి ఎంపీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలంటూ కేంద్రం రూపొందించిన పథకాన్ని యూజ్‌లెస్ స్కీమ్ అని కవిత తెగనాడారు. ఎంపీ పరిధిలో సగటున 800 గ్రామాలుండగా ఒక్క గ్రామాన్నే దత్తత పేరుతో అభివృద్ధి చేయాలని చెప్పడమేందని అడిగారు. ఎంపీ మన ఊరు, మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా కవిత కరీంనగర్ జిల్లా సారంగపూర్‌లో మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి స్వగ్రామం బీర్‌పూర్‌లో పర్యటించారు. మావోయిస్టులు అడవులు వీడి బంగారు తెలంగాణకు సహకరించాలని అన్నారు. మావోయిస్టులది, టీఆర్ఎస్‌ది ఒకటే ఎజెండా అని చెప్పారు. వారి జెండా ఎరుపు అయితే, తమది గులాబీ జెండా అని పోల్చారు.