ఈ మాట వినగానే అది ఎవరిని ఉద్దేశించి అన్నదో ఎవరికయినా ఇట్టే అర్ధమయిపోతుంది. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రాజధాని కోసం రైతులపై భూసేకరణ చట్టాని ప్రయోగించవద్దని ఏపీ ప్రభుత్వానికి వరుస పెట్టి ట్వీట్ మెసేజులు పెడుతున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు కూడా ట్వీటర్లో పవన్ కళ్యాణ్ న్ని బాగా ఫాలో అవుతున్నారో లేక పవన్ కళ్యాణ్ చేసే ట్వీట్ల గురించి న్యూస్ పేపర్లలో వస్తున్న వార్తలు చూసి స్పందించారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఓ సలహా ఇచ్చారు.
ఇంట్లో కూర్చొని ట్వీటర్ మెసేజులు పెట్టే బదులు రాజధాని ప్రాంతానికి వెళ్లి అక్కడి రైతుల కోసం పోరాడమని వి.హెచ్. పవన్ కళ్యాణ్ కి సూచించారు. ఏపీ ప్రభుత్వం రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించి వారి భూములు లాకొంటుంటే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి రైతులకు అండగా నిలబడాలని వి.హెచ్. సలహా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా తను త్వరలోనే ఉండవల్లి, పెనుమాక, బేతపూడి తదితర గ్రామాలలో పర్యటించి రైతులను కలుస్తానని ట్వీట్ మెసేజ్ పెట్టారు. ఈరోజు నుండే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం క్రింద కొందరు రైతులకు నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కి రైతుల తరపున పోరాడే ఉద్దేశ్యం ఉంటే ఇంకా మీనమేషాలు లెక్కపెట్టనవసరం లేదని వి.హెచ్. సూచిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ తుళ్ళూరు వెళ్లేందుకు ముహూర్తం ఇంకా ఖరారు చేసుకొన్నారో లేదో మళ్ళీ ఆయన ట్వీట్ మెసెజ్ పెడితే గానీ తెలియదు.