రాజధాని ప్రాంతంలో మిగిలిన 2,200ఎకరాల భూమిని రైతుల నుండి స్వాధీనం చేసుకోవడానికి భూసేకరణ చట్టం క్రింద నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మొదట తుళ్ళూరు, బోరుపాలెం, అనంతవరం, పిచుకలపాలెం మరియు అబ్బురాజు పాలెం గ్రామాలలో11.04 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దానితో రాజధాని ప్రాంతంలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూములు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్న రైతులు తీవ్రంగా నిరసనలు తెలియజేస్తున్నారు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.
తమ పార్టీ రైతుల అండగా నిలబడి ప్రభుత్వంతో పోరాడుతుందని తెలిపారు. భూసేకరణకు వ్యతిరేకిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల బంద్ కి పిలుపునివ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులను కలుస్తానని మెసేజ్ పెట్టారు కనుక, ఆయన కూడా వస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. కానీ భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎంతమాత్రం వెనక్కి తగ్గేది లేదని రాష్ట్ర మంత్రులు మాటల ద్వారా స్పష్టం అవుతోంది. కనుక ఈ ఆఖరి ఘట్టంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటీ ఒకవైపు, రైతులు, ప్రతిపక్షాలు,పవన్ కళ్యాణ్ మరోవైపు నిలిచి యుద్ధం చేయడం అనివార్యంగా కనిపిస్తోంది.