రాజకీయ నాయకుల మాటలకు అడ్డూ అదుపు ఏమీ ఉండదు. చరిత్ర అసలే గుర్తుండదు. నోటికి ఏదనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. ముందుగా ఎవరో ఒక చిన్న నాయకుడి చేత తాము చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పిస్తారు. ఆ చెప్పిన విషయానికి పెద్దగా విమర్శలు రాకపోతే చాలు. ఇక అసలు నాయకులందరూ అదే పాట పాడుతూ ఉంటారు. ఇప్పుడు వెంకయ్యనాయుడి విషయంలో కూడా అలాంటి కొన్ని ప్రకటనలు తరచుగా కనిపిస్తున్నాయి. అదే విషయాన్ని వెంకయ్యనే స్వయంగా చాలా సార్లు మాట్లాడేశారు. ‘హోదాకు మంగళం పాడడంపై, మాయల మరాఠీ ప్యాకేజ్ పైన విమర్శల ఘాటు కొంచెం తగ్గగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రెచ్చిపోతున్నారు. ‘వెంకయ్య నాయుడిపైన విమర్శలు బాధాకరం. వెంకయ్యనాయుడు మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం లేదు. రాష్ట్రానికి ఆయన ఏమీ చేయకపోయినా మనమేమీ చేయలేం. అయినప్పటికీ ఆయన మనకోసం చాలా చాలా కష్టపడుతున్నారు….’ ఇలా సాగుతున్నాయి బాబుగోరి అమృత వాక్కులు. వెంకయ్య నోటి నుంచి కూడా అవే మాటలు వినిపిస్తున్నాయి. అనుకూల మీడియా కూడా అదే పాట పాడుతోంది. అట్టే మాట్టాడితే వెంకయ్యనాయుడు కూడా కాడిపడేస్తే…. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ దిక్కూ ఉండదు అనే రేంజ్లో బెదిరింపులు కూడా చేస్తోంది.
అవునా…? నిజమేనా…? వెంకయ్యనాయుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం లేదు. కరెక్టే. కానీ బాధ్యత కూడా లేదా? 2014 ఎన్నికల సమయంలో టిడిపి, బిజెపిలకు ఓటేయండి అని ఆంధ్రప్రదేశ్ ఓటర్ల చుట్టూ తిరిగి ఓట్లు అడిగిన మహానుభావులెవరు? చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో ఓటర్లకు హామీలిచ్చిన నాయకుడు ఎవరు? నరేంద్రమోడీ తరపున వకాల్తా పుచ్చుకుని హామీల వర్షం కురిపించిందెవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్ళేలా చేసే బాధ్యత మాది అని వెంకయ్య చెప్పిన కబుర్ల మాటేమిటి? అలాగే వపన్ కళ్యాణ్ కూడా బాధ్యత తీసుకుంటానన్నాడుగా. ఎన్నికలలో నిలబడకపోయినప్పటికీ ఆయా పార్టీలకు ఓట్లు వేయమని ప్రచారం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళలో కొంతమంది తాము బాధ్యత తీసుకుంటాం అని చాలా గట్టిగా చెప్తారు. వెంకయ్య, పవన్ కళ్యాణ్లిద్దరూ కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పినవాళ్ళే. ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో చాలా మంది వెంకయ్య, పవన్ కళ్యాణ్‌లను చూసి ఓట్లేసినవాళ్ళున్నారు. అసలు ప్రత్యేక హోదా హీరో వెంకయ్య, వెంకయ్యనాయుడి పార్టీ బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే…. ఆ హోదా కొన్ని గంటల్లోనే వచ్చేస్తుంది అనే రేంజ్లో ప్రచారం చేసి కాదా ఓట్లు దండుకున్నది.
వెంకయ్య, చంద్రబాబు, అనుకూల మీడియావారు ఆ చరిత్ర అంతా మరిచిపోయారా? నేనేమైనా ఎమ్మెల్యేనా? ఎంపినా? నా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎంపిలున్నారా? ఎమ్మెల్యేలకు, ఎంపిలకే చేతకానిది నాకెలా సాధ్యమవుతుంది? అని పవన్ కళ్యాణ్‌గారు కూడా చాలా అమాయకంగా ప్రశ్నిస్తూ ఉంటారు. అత్యంత అనుభవజ్ఙుడైన వెంకయ్యది కూడా అంతే అమాయకత్వం ఒలకబోస్తున్నారు. ‘నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రానిధ్యం వహించటం లేదు. నాకేం సంబంధం….?’ అని. ఇవే మాటలు ఎన్నికల ప్రచారం సమయంలో కూడా చెప్పి ఉండొచ్చుగా. కేవలం చంద్రబాబు, మోడీలకు ఓట్లేయమని చెప్పడానికే వచ్చాం. గెలిచాక వాళ్ళేం చేస్తారో, ఏమీ చేయరో మాకు తెలియదు. వాళ్ళేమైనా చేసినా, చేయకపోయినా మాకు సంబంధం లేదు. మమల్ని అడగొద్దు అని ప్రచారం చేయకపోయారా?
అందరూ మిమ్మల్నే విమర్శిస్తున్నారని మీరు చాలా బాధపడిపోతున్నారని మీరూ చెప్పుకుంటున్నారు. చంద్రాబాబునాయుడుగారు కూడా తెగ బాధపడిపోతున్నారు. మిమ్మల్ని సమర్ధించే మీడియా కూడా సెంటిమెంట్ వర్షం కురిపిస్తోంది. రాజకీయ విమర్శల విషయం పక్కనపెడితే మీరు చేస్తున్న మోసాలకు, మోసపు మాటలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవేధన చెందుతున్నారు వెంకయ్యాగారు. కొన్ని తరాల పాటు వెనుక బడిన ప్రజలుగానే ఉండిపోతామేమో అని భయపడుతున్నారు. మీతో పాటు మిమ్మల్ని సమర్ధిస్తున్న వాళ్ళందరూ మాత్రం… ఆ తప్పుకు మాది బాధ్యత కాదు అని చెప్పుకునే ప్రయత్నాల్లో మాయమాటలన్నీ చెప్పేస్తూ ఉన్నారు.