మన దేశంలో చాలా పార్టీలలో వారసత్వ రాజకీయాలు, ప్రభుత్వాలలో కుటుంబ పాలన కనిపిస్తుంటుంది. ఈరోజుల్లో ఇది సర్వసాధారణమైన విషయంగానే అందరూ భావిస్తున్నారు. అయితే వారసత్వ రాజకీయాలు, కుటుంబపాలన రాజరిక వ్యవస్థకి సరిపోతాయేమో గానీ ప్రజాస్వామ్య విధానానికి సరిపడవని తెలిసినా ఆ రెండూ ఇప్పుడు అనివార్యం అయిపోయాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీలో, దాని ప్రభుత్వంలో కూడా ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్, ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ ల మధ్య గత కొన్ని నెలలుగా సాగుతున్న అంతర్యుద్దం పతాక స్థాయికి చేరుకొంది. శివపాల్ యాదవ్ పిర్యాదులు విని అఖిలేష్ యాదవ్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి ములాయం సింగ్ తప్పిస్తే, అందుకు ప్రతిగా చిన్నాన్న శివపాల్ యాదవ్ నిర్వహిస్తున్న మూడు మంత్రిత్వ శాఖలని అఖిలేష్ యాదవ్ వెనక్కి తీసేసుకొన్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ కి ఆ అధికారాలు ఉన్నాయని చెపుతూనే ‘పార్టీలో ఎంతటి వారైనా సరే పెద్దాయన (మూలాయం సింగ్ యాదవ్) నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే’ అని శివపాల్ యాదవ్ హెచ్చరిక కూడా చేశారు. వారిద్దరి మద్య జరుగుతున్న ఈ గొడవల కారణంగా పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటుండటంతో వాటిని సరిదిద్దడానికి ములాయం సింగ్ యాదవ్ రంగంలో దిగుతున్నారు. ఈరోజు ఆయన డిల్లీ నుంచి లక్నో చేరుకొని వారిద్దరితో ముఖాముఖి మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాదిలో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఇటువంటి కీలక సమయంలో అధికారంలో ఉన్న తమ పార్టీలో ఈవిధంగా గొడవలు జరుగుతుండటం, అవి రచ్చకెక్కడం ములాయం సింగ్ యాదవ్ కి చాలా ఆగ్రహం కలిగిస్తున్నాయి. అఖిలేష్ పాలన పట్ల ములాయం సింగ్ గతంలోనే ఒకటి రెండుసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కనుక ఏదోవిధంగా అఖిలేష్ ని మళ్ళీ దారిలో పెట్టి ఈ గొడవలు సర్దుమణిగేలా చేయక తప్పదు. ఇప్పటికే అఖిలేష్ కొంచెం వెనక్కి తగ్గినట్లు మాట్లాడుతున్నారు. శివపాల్ యాదవ్ కూడా కొంచెం మెత్తబడినట్లుగానే మాట్లాడారు. కనుక కనీసం వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు పూర్తయ్యేవరకైనా అందరూ సర్దుకుపోక తప్పదు లేకుంటే వారికే నష్టం. అయినా కుటుంబ పాలనలో ఇటువంటి ఆధిపత్య పోరాటాలు సహజమే.