రాజకీయ నాయకులకు పదవి కావాలి. హోదా కావాలి. ముందు వాళ్ళకు పదవి వచ్చాక కుటుంబ సభ్యులకు కూడా కావాలనుకుంటారు. ఆ తర్వాత బంధువులకు కూడా పదువులు కావాలని కోరుకుంటారు. వాళ్ళ ఆశకు హద్ధంటూ ఏమీ ఉండదు. అలా అతిగా ఆశపడే 2014ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా పేరున్న ఓ ముగ్గురు ప్రముఖ నాయకులు దారుణంగా దెబ్బతిన్నారు. వాళ్ళే నితీష్ కుమార్, కేజ్రీవాల్, ములాయం సింగ్ యాదవ్. 2014లో ముగ్గురి టార్గెట్ ఒక్కటే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవడం. నరేంద్రమోడీకి మైనారిటీలు ఓట్లేసే అవకాశం లేదు అనుకున్నారు. దశాబ్ధ కాలం నాటి చరిత్రను చూసుకుంటే బిజెపికి 200 కంటే తక్కువ సంఖ్యలోనే ఎంపి సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పరిస్థితి కూడా సేం టు సేం. అదే జరిగితే నరేంద్రమోడీకి లౌకిక పార్టీలు (?) సపోర్ట్ చేసే అవకాశం లేదని, తగిన సంఖ్యలో ఎంపిలు ఉంటే ప్రధాని కుర్చీ ఎక్కేయడం ఈజీనే అని ముగ్గురూ కూడా వాళ్ళ వాళ్ళ భ్రమల్లో ఉండిపోయారు. ప్రధాని పదవి కోసం కొన్ని త్యాగాలు కూడా చేసేశారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కుర్చీని వదిలేసుకున్నాడు. కేజ్రీవాల్‌ది కూడా అలాంటి చరిత్రే. ఇక ములాయం సింగ్ కూడా…తను ఎలాగూ ప్రధానమంత్రి అయిపోబోతున్నానన్న ఉద్ధేశ్యంతో కాళ్ళ దగ్గరకు వచ్చిన ముఖ్యమంత్రి పదవిని కొడుక్కి అప్పగించేశాడు.
కట్ చేస్తే నరేంద్ర మోడీ సునామీ దెబ్బకు ముగ్గురు నేతలకూ చుక్కలు కనిపించాయి. కేజ్రీవాల్, నితీష్ కుమార్‌లు నానా కష్టాలూ పడి పాత కొలువులను దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యారు. పాపం ములాయం పరిస్థితే…తన స్థాయి(?)కి తగ్గ పదవి అంటూ ఏమీ లేకుండా పోయింది. బిజెపికి ఫుల్ మెజార్టీ వచ్చేయడంతో తన పార్టీ ఎంపీలను చూపించి గవర్నర్‌గిరీని డిమాండ్ చేద్దామన్నా కూడా కుదరని పరిస్థితి. తనకు ప్రధానమంత్రి పదవి ఉంటే కొడుక్కి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయడం బాగానే ఉంటుంది కానీ, ఉన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి పదవిని కొడుక్కు ఇచ్చి… తను గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం ఏం బాగుంటుంది? అని ఫీలవుతున్నాడు. పైగా అఖిలేష్ కూడా ములాయం మాటకు విలువ ఇవ్వడం లేదు. ములాయంని కేర్ చెయ్యడం లేదు. సొంత రాజకీయం చేసేస్తున్నాడు. అదే ములాయంకి మంట పుట్టేలా చేస్తోంది. నితీష్ కుమార్ లాంటి వాళ్ళకు బయటి నేతల నుంచి సమస్య వచ్చింది కాబట్టి కొంచెం సులభంగానే ఆ నేతలను దించేయగలిగారు. కానీ ములాయం పరిస్థితి అది కాదుగా. సొంత తండ్రి, కొడుకులే కుర్చీ కోసం కొట్లాడుకున్నారంటే ఓటర్లందరూ ఛీ కొట్టరు. 2019లో కూడా నరేంద్రమోడీనే అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత నుంచి లౌకిక (?) రాజకీయాలను, మైనార్టీ రాజకీయాలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజకీయం చేయడానికి కూడా ఏమీ లేదు. అందుకే అర్జెంట్‌గా ములాయంకి పదవి కావాల్సి వచ్చింది. అఖిలేష్ యాదవ్కేమో ఈ వృధ్ధ నేతతో అవసరం తీరిపోయింది. ఈ అధికార యావ ఈ తండ్రి కొడుకుల మధ్య ఇంకా ఎలాంటి గొడవలకు దారితీస్తోందో చూడాలి మరి.