హైదరాబాద్: ఇవాళ 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవిని సినిమా, రాజకీయరంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు ఆయన ఇంటివద్ద కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులుకూడా ఉండటం విశేషం. బొత్స సత్యనారాయణ, గతంలో ప్రజారాజ్యంలో ఉండి వైసీపీలోకి మారిన జ్యోతుల నెహ్రూ, కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ నేత రుద్రరాజు పద్మరాజు ఇవాళ చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి రాజకీయాలలోకి రాకముందునుంచీ, తనకు ఆయనతో మంచి అనుబంధం ఉందని, తాను చిన్నప్పటినుంచీ ఆయన అభిమానినని సుబ్బారాయుడు చెప్పగా, చిరంజీవిని వ్యక్తిగతంగా, నటుడిగా తాను అభిమానిస్తానని జ్యోతుల నెహ్రూ చెప్పారు.
మరోవైపు శుభాకాంక్షలు చెప్పటానికి వచ్చినవారితో చిరంజీవి ఇంటివద్ద ఇవాళ ఉదయంనుంచి పండగ వాతావరణం నెలకొంది. వీరిలో సినీ పరిశ్రమకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. చిరుకు 60 ఏళ్ళు వచ్చాయని తాము భావించటంలేదని ఎక్కువమంది చెప్పారు. వివిధ రకాల బొకేలతో చిరును కలుస్తున్నారు. అటు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, చిరంజీవికి 60 ఏళ్ళు అనటం తనకు నచ్చలేదని, ఆయనకు 26 ఏళ్ళేనని ట్వీట్ చేశారు. ఇక గవర్నర్లు నరసింహన్, రోశయ్య చిరంజీవికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో పెద్ద ఎత్తున బర్త్డే పార్టీ జరగబోతోంది. దీనికి టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్నుంచి సినీ ప్రముఖులు రానున్నారని చెబుతున్నారు. ఈ ఫంక్షన్ ఏర్పాట్లను రాంచరణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చిరుకు ఇష్టమైన వంటకాలను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు.