నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడి నిమజ్జన మహోత్సవంతో హైదరాబాద్ సందడిగా మారింది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్కరోజులోనే నిమజ్జనాన్ని ముగించడానికి పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ వినాయక విగ్రహ నిమజ్జన శోభాయాత్ర గురువారం ఉదయమే ప్రారంభమైంది. ఇందుకోసం బుధవారం ఉదయం నుంచే సన్నాహాలు చేశారు. మధ్నాహ్నం కల్లా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తి చేస్తారు. ప్రతిసారీ ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం 24 గంటలు ఆలస్యంగా జరుగుతూ వస్తోంది. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలిగేవి. అందుకే ఈసారి బాలాపూర్ గణేశ్ విగ్రహం కంటే ముందే ఖైరతాబాద్ వినాయక శోభాయాత్రను ప్రారంభించారు.
ఈసారి నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 25 వేల మంది పోలీసులు బందోబస్తు డ్యూటీలో పాల్గొంటున్నారు. 8,722 మంది పారా మిలటరీ జవాన్లు కూడా పహరా కాస్తున్నారు. బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్, స్నైపర్ డాగ్ టీంలను సిద్ధంగా ఉంచారు. భక్తుల మాటున విధ్వంసకర శక్తులు చొరబడే ప్రమాదం ఉండటంతో సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. సుమారు 20 లక్షల మంది ప్రజలు ఈ వేడుకల్లోపాల్గొంటారని అంచనా. వారి భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.
భక్తులకు అసౌకర్యం కలగకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏర్పాట్లు చేసింది. వివిధా విభాగాలు సమన్వయంతో వ్యవహరిస్తున్నాయి. ఈసారి ప్రత్యేకంగా 3000 మందితో గణేశ్ యాక్షన్ టీమ్ ను ఏర్పాటు చేశారు. హుసేన్ సాగర్ తో పాటు నగరం నలుమూలలా ఉన్న చెరువులతో పాటు, కొత్తగా ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక కోనేరుల్లో గణేశ్ నిమజ్జనం జరుగుతుంది. ఈసారి 25 వేల నుంచి 30 వేల విగ్రహాల నిమజ్జనం జరగవచ్చని భావిస్తున్నారు. ఒక్క ట్యాంక్ బండ్ పైనే 25 అతిపెద్ద క్రేన్లను ఏర్పాటు చేశారు. రాత్రివేళ ఇబ్బంది కలగకుండా 20 వేల తాత్కాలిక లైట్లను ఏర్పాటు చేశారు.
నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర ప్రధాన మార్గంలో ఇతర వాహనాల రాకపోకలను నిషేధించారు. కేవలం నిమజ్జన వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు.