ప్రత్యేక హోదా అంశంపై నుంచి ప్రజల దృష్టిని పోలవరం ప్రాజెక్టు మీదకి మళ్ళించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, దానిపై నుంచి ప్రజల దృష్టి మళ్ళకుండా ఉంచేందుకు ప్రతిపక్షాలు చాలా కష్టపడుతున్నాయి. అంటే అధికార, ప్రతిపక్షాలకి ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి కలిగే లాభం కంటే దాని వలన కలిగే రాజకీయ లాభనష్టాల లెక్కలే ముఖ్యం అని స్పష్టం అవుతోంది. ప్రత్యేక హోదా గురించి ఇంకా ఎంత కాలం రాష్ట్రంలో చర్చలు, దీక్షలు, ధర్నాలు, బందులు వగైరా సాగితే, ప్రజలలో తమ పార్టీపై, ప్రభుత్వంపై అంత వ్యతిరేకత పెరుగుతుందని తెదేపా భయపడుతోంది. అందుకే ప్రత్యేక ప్యాకేజి ప్రకటనకి కృతజ్ఞత ప్రకటనతో హోదా అంశానికి మంగళం పాడేసి, ‘500 రోజులలో పోలవరం పూర్తి చేస్తాం’ అనే సరికొత్త పాటని ముఖ్యమంత్రి అందుకొన్నారు. ఒక తెదేపా నేత ఆ 500 రోజులలో 10 రోజులు కత్తిరించేసి మిగిలిన 490 రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేయబోతున్నామని గొప్పగా చెప్పుకొన్నారు. తెదేపా నేతలు, మంత్రులు ఇంకా ముఖ్యమంత్రితో కలిసి పోలవరం కోరస్ పాట పాడటం మొదలుపెట్టలేదు. మొదలుపెడితే ఆ హోరులో ప్రతిపక్షాలు చేస్తున్న ‘ప్రత్యేక శబ్దాలు’ వినబడకుండా పోవడం ఖాయం అని చెప్పవచ్చు.
ఇక ప్రభుత్వం ఎత్తుగడని ప్రతిపక్షాలు కూడా బాగానే పసిగట్టినట్లున్నాయి. అందుకే అవి కూడా ప్రత్యేక హోదాపై చర్చలు, సమావేశాలు, దీక్షలు, ధర్నాలు అంటూ హడావుడి చేస్తున్నాయి. ఈరోజు తిరుపతిలో వైకాపా ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఆ పార్టీ నేతలు ప్రత్యేక హోదా కోసం ధర్నా చేశారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాడకపోయినా తాము మాత్రం అది సాధించేవరకు పోరాడుతూనే ఉంటామని చెప్పారు.
గతంలో ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకి కూర్చొన్నప్పుడు కూడా ఇలాగే భింకాలు పలికారు. కానీ ఆ తరువాత ఏమి జరిగిందో అందరూ చూశారు. ఇలాగ కామాలు, ఇంటర్వెల్స్ పెట్టుకొంటూ చేసే ప్రత్యేక పోరాటాల వలన ఆ పార్టీలకి ఏమైనా రాజకీయ మైలేజ్ లభిస్తుందేమో కానీ రాష్ట్రానికి, ప్రజలకి వాటి వలన ఎంతో కొంత నష్టమే తప్ప ఎటువంటి లాభం ఉండదని చెప్పక తప్పదు. ప్రత్యేక హోదా కావాలంటే అధికార పార్టీకైనా దానిని సాధించుకోవాలనే తపన, చిత్తశుద్ధి ఉండాలి లేదా ప్రతిపక్షాలకైనా ఉండాలి. కానీ రెంటికీ లేదని రుజువు చేసుకొంటున్నాయి.