Nirmala Convent Review
తెలుగు360.కామ్ రేటింగ్ 2/5
మనం, సోగ్గాడే…ఊపిరి చిత్రాల విజయాలతో మంచి ఊపు మీదున్న అక్కినేని నాగార్జున, ఎప్పుడూ సరికొత్త కథలతో, కొత్త దర్శకులను తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసే మంచి హస్త వాసి కలవాడు. ఈ సారి హీరో శ్రీ కాంత్ తనయుడు రోషన్ ని హీరో గా, జి.నాగ కోటేశ్వర్ రావు ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… తను ప్రత్యేక పాత్ర పోషిస్తూ… అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై ప్రతిష్టాత్మకం గా నిర్మించిన చిత్రం ‘ నిర్మల కాన్వెంట్’. షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అయినా, ఇటీవల నాగార్జున పాడిన ‘కొత్త కొత్త భాష’ సాంగ్ ప్రోమోతో ఈ చిత్రానికి క్రెజ్ వచ్చింది. సినిమా మీద వారికున్న నమ్మకమో ఏమో కానీ సెప్టెంబర్ 16 తేదీ విడుదలకు ముందు రోజు 15న రాత్రి ప్రీమియర్ షో ప్రదర్శించారు. మరి వారి అంచనాలకు చేరువ అయ్యిందో లేదో సమీక్ష లో తెలుసుకుందాం.
కథ :
భూపతి నగరం అని ఓ చిన్నపాటి ఊరు, ఎత్తైన కొండలు, పచ్చటి పొలాలతో వుండే ఆ ఊరి రాజుగారికి 99 ఎకరాల పొలం కానీ ఒకే ఒక ఎకరం వున్నవాడు వీరయ్య (ఎల్ బి శ్రీ రామ్) 99 ఎకరాలు ఒక ఎత్తైతే, ఈ ఒక్క ఎకరం ఒక ఎత్తు…ఎందుకంటె వీరయ్య పొలం ద్వారానే సాగు నీరు రాజు గారి పొలానికి వెళ్ళాలి. వీరయ్య ఆ ఒక్క ఎకరం అమ్మడం లేదని జాతరలో అతన్ని చంపేంస్తారు. ప్రాణం పోయిన పరవాలేదు కానీ ఆ ఒక్క ఎకరం అమ్మొద్దు అని కొడుకు డేవిడ్(సూర్య) వద్ద మాట తీసుకుని ప్రాణాలు విడుస్తాడు వీరయ్య. డేవిడ్ కొడుకే శామ్(రోషన్). ఆ రాజుగారి మనవరాలు శాంతి (శ్రియ శర్మ) చిన్నతనం నుండి వీళ్లిద్దరు నిర్మల కాన్వెంట్ లో చుదువుతుంటారు. చదువులో, జనరల్ నౌలెడ్జి లో శామ్ ఫస్ట్, అల్లరి లో శాంతి ఫస్ట్. ఇక షరా మామూలే… పాత కధే గొప్పింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి ప్రేమించుకుంటారు. ప్రేమంటే పడని శాంతి తండ్రి భూపతి రాజు(ఆదిత్య మీనన్) కు ఈ విషయం తెలుస్తుంది. ఆ కారణం గా పాలేర్లతో శామ్ ని కొట్టిస్తాడు. తీవ్రంగా గాయాల పాలైన శామ్ పరిస్థితి చూసి తండ్రి డేవిడ్ భూపతి రాజా ను కూతురు నిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. ఎప్పటి నుండో ఆశ పడుతున్న ఆ ఒక ఎకరం ఇస్తే అలాగే చేస్తానని, సంతకం పెట్టించుకుని మోసం చేసి, నా స్థాయికి ఎదిగి అప్పడు రా… నా పిల్లను ఇస్తాను అంటాడు. మరి ఈ విషయం తెలిసిన శామ్ ఏం చేసి ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. అన్నదే మిగతా కథ..
ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్:
“నేను అమితాబ్ కి పెద్ద ఫ్యాన్ ని. కొన్నేళ్లుగా ఆయన చేసే పాత్రలు చూస్తే సపోర్టింగ్ రోల్స్ అయినా హీరోలానే ఉండేవి. ఆయనలా అర్థవంతమైన పాత్రలు, అర్థవంతమైన సినిమాలు చేయాలని అనుకుంటున్నాను ” అంటూ ఇటీవల నిర్మల కాన్వెంట్ ప్రమోషన్ లో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో అన్న మాటలివి. అయితే ఈ చిత్రం లో ఓ సెలబ్రిటీ గా తన పర్సనల్ క్యారెక్టర్ ని పోషించాడు నాగార్జున. అంతే తప్ప అర్థవంతమైన బలమైన పాత్రేమీ కాదు. అయన పరిధిలో అయన నటించాడు. కానీ సినిమాకు, కథకు ఊపిరినిచ్చిన కదాంశం తో అయన పాత్ర ఉండడం, అతని ఎంట్రీ తో సినిమా ఊపు అందుకోవడం లాంటివి జరిగాయి. ఈ సినిమా లో నాగార్జున ఉన్నాడన్న విషయం ప్రేక్షకుడికి ముందుగా తెలుసు కాబట్టే, సెకండ్ హాఫ్ థియేటర్ లో కూర్చోగలిగాడు. ఈ చిత్రం లో ఆయన నటించక పోయివుంటే …ఫస్ట్ హాఫ్ లోనే ప్రేక్షకుడు తిరుగు ముఖం పట్టేవాడు. ఇక తెలుగు తెర కు హీరో గా పరిచయం అయినా రోషన్ యుక్త వయసుకు తగ్గ పాత్రలో బాగానే చేసాడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్ గా ప్రమోషన్ కొట్టేసిన శ్రియ శర్మ చూడ ముచ్చటగా వుంది. కానీ ఇంకా చిన్న పిల్ల లా కనిపించే ఆ వయసు లో కథకు అవసరం లేని ఎక్సపోసింగ్ ఎబెట్టు గా వుంది. మిగతా నటి నటులు తమ పాత్రల మేరకు నటించారు..
సాంకేతిక వర్గం :
సెకండ్ హాఫ్ మినహా ఈ చిత్రం మళ్ళీ మళ్ళీ చూస్తున్నామా అనిపిస్తుంది. ఇదే సబ్జెక్ట్ తో ఇదవరకే సినిమాలు చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు జి.నాగ కోటేశ్వర్ రావు, ఫ్రెష్ అండ్ ప్యూర్ లవ్ స్టోరీ అని చెప్పి అవుట్ డేటెడ్ కథ ను ఎంపిక చేసుకున్నాడు. డైరెక్టర్స్ హ్యాండిల్ చేసిన తీరులో చాలా లోపాలు వున్నాయి. డైలాగ్స్ పరంగా కానీ, సన్నివేశాల పరంగా కానీ కొత్తదనం ట్రై చేయలేకపోయాడు. సెకండ్ హాఫ్ లో టివి లో మనకు తెలిసిన షో యదా ప్రకారం ఉంటుంది కాబట్టి దర్శకుడి గురుంచి ప్రత్యేకంగా గా చెప్పడానికి ఏమి లేదు. సినిమాటోగ్రఫీ పరవా లేదు. సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.’కొత్త కొత్త భాష’ అనే పాటను ఏ ఆర్ రహమాన్ తనయుడు (ఏ ఆర్ అమీన్) మరియు నాగార్జున తో పాడించడం బాగుంది. అనుభవమున్న సంగీత దర్శకుడిగా ఈ చిత్రానికి పని చేసాడు. ఇక సినిమా నిర్మాణ విలువల విషయానికొస్తే కథకు తగ్గట్టు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టారు, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా కూడా రిచ్ గానే అనిపించింది.
విశ్లేషణ :
ఈ చిత్రం గురించి చెప్పుకోవాలంటే ముందుగా నాగార్జున గురించి చెప్పుకోవాలి….ఎప్పుడు కొత్తదనానికి స్వాగతం పలికి సక్సెస్ సాధించిన అక్కినేని నాగార్జున ఈ సారి తప్పటడుగు వేసాడనిపించింది. 80 వ దశకం లో కూడా ఇంతకంటే మంచి ప్రేమ కథలు చాలా వచ్చాయి. కేవలం నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఎపిసోడ్ తప్పించి మిగతా కథ అంతా సదా సీదా ప్రేమ కథ. వచ్చి రాని వయసులో, అదీ చదువుకునే రోజుల్లో (అమ్మాయి 16 అబ్బాయి 18) ప్రేమించుకోవడం, ప్రేమ భాష, ముద్దుల వివరణ ఇవన్నీ టీనేజ్ ని చెడగొట్టే కథాంశం తీసుకోవడం లో నిర్మాత గా నాగార్జున కి ఈ చిత్రం లో నచ్చిన అంశం ఏమిటో అర్ధం కాదు. చాలా సినిమా లో హీరో తాను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోడానికి ప్రతిజ్ఞ పూనడం అది నెరవేర్చుకోవడం లాంటి కథలు చూసి చూసి బోర్ కొట్టించాయి. మళ్ళీ మళ్ళీ అదే కథ ను చూపించడం కథకుడి లోపం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. త్వరలో రాబోయే ‘ఛాంపియన్ అఫ్ ఛాంపియన్’ అనే టివి కార్యక్రమానికి ప్రమోషన్ లా వుంది ఈ సినిమా. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే నాగార్జున అభిమానులకి ఈ చిత్రం చాలా నచ్చుతుంది. ఈ చిత్రం చూసి సాధారణ ప్రేక్షకుడు మాత్రం ఇంట్లో ఉండి చూసే ప్రోగ్రాం ని డబ్బులు ఇచ్చి థియేటర్ లో చూడాలా…అని…నిరాశ తో వస్తాడు.
తెలుగు360.కామ్ రేటింగ్ 2/5
బ్యానెర్లు : అన్నపూర్ణ స్టూడియోస్, మాట్రిక్స్ టీం వర్క్స్, కాన్సెప్ట్ ఫిలిం ప్రొడక్షన్స్,
నటీనటులు : అక్కినేని నాగార్జున (స్పెషల్ అప్పీరెన్స్) రోషన్ (తొలి పరిచయం) శ్రియ శర్మ(తొలి పరిచయం) ఆదిత్య మీనన్, రవి ప్రకాష్, సమీర్, సూర్య,ఎల్ బి .శ్రీ రామ్, తాగుబోతు రమేష్, అనిత చౌదరి, సత్య కృష్ణన్, చంద్ర హాస్, ప్రభు, రోషన్ కనకాల తది తరులు…..
సంగీతం : రోషన్ సాలూరి ( తొలి పరిచయం)
పాటలు :చంద్ర బోస్, అనంత శ్రీరామ్,
సినిమాటోగ్రఫీ : ఎస్ వి .విశ్వేశ్వర్,
సహా నిర్మాత : గీత,
నిర్మాతలు : అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్,
రచన, దర్శకత్వం : జి.నాగ కోటేశ్వర్ రావు,
విడుదల తేదీ : 16.09.2016.