‘నిజానిజాలను ప్రజలకు అందించాలి. కులం, ప్రాంతం, మతం వంటి వాటితో భావోద్వేగాలను ఎగదోయాలని చూసేవారిని ప్రోత్సహించొద్దు. అవినీతిని అస్సలు సహించొద్దు. అనైతిక ఒత్తిడికి తలొగ్గవద్దు. పాత్రికేయ ప్రమాణాలు పాటించండి……’ ఇంకా ఇలాంటివే బోలెడన్ని మంచి మాటలు చెప్పుకొచ్చాడు వెంకయ్య. వెంకయ్య నాయుడు చెప్పిన విలువలను జర్నలిస్టులు, మీడియా సంస్థలు పాటిస్తున్నారా? లేదా? అన్న విషయం పక్కన పెడదాం. నిజంగా అంతటి నిబద్ధతతో ఉంటే పాలకులు సహిస్తారా? విమర్శలను భరించగలరా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలను ప్రోత్సహిస్తున్నారా? డబ్బులు తీసుకుని వార్తలు రాయడం కూడా చాలా పెద్ద తప్పు అని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు. అసలు డబ్బులిచ్చి వార్తలు రాయించుకుంటున్నది ఎవరు? ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసి ప్యాకేజ్ అని ఏవో మాయమాటలు చెప్పిన బిజెపి వాళ్ళు…. మరుసటి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేం ఆక్సిజన్ అందించాం అనే రేంజ్లో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారు అని విమర్శించిన వాళ్ళందరిపైనా ఎదురుదాడికి దిగాడు వెంకయ్య. అలాగే వెంకయ్య నాయుడు ఇంకా అప్డేట్ అవ్వలేదేమో కానీ… ఇంకా పెయిడ్ న్యూస్ కల్చర్ ఎక్కడ ఉంది? అంతా బినామీ వ్యవహారమే కదా? తెలుగులో ప్రముఖ స్థానంలో ఉన్న మూడు న్యూస్ పేపర్స్ బాగోతం చూడండి. పెయిడ్ న్యూస్ అంటూ స్పెషల్‌గా ఏం ఉంది? ప్రతి మీడియా సంస్థ కూడా ఏదో ఒక పార్టీకి భజన బృందంలా తయారైంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణాలో కూడా అదే పరిస్థితి. తెలంగాణా ప్రజల కోసమే అహర్నిశలూ పని చేస్తున్నాం అని చెప్పుకునే ఓ ప్రముఖ పత్రిక తెలంగాణా ప్రజల గురించి తక్కువగా, కెసీఆర్ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది.
న్యూస్ పేపర్స్‌ని, న్యూస్ ఛానల్స్‌ని పొల్యూట్ చేయడంలో మన నాయకులందరూ ఎప్పుడో సక్సెస్ అయ్యారు. అదే టైంకి వెబ్ మీడియా పాపులర్ అయింది కానీ లేకపోతే ప్రజలందరూ కూడా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల అభీష్టం మేరకు ఉండే సమాచారాన్నే తెలుసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. దేశంలో అన్ని వ్యవస్థలనూ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా ఉంటాయి మన నాయకుల చేతలు. కానీ మాటలు మాత్రం దేశాన్నే ఉద్ధరించడానికి పుట్టిన దైవదూతలం మేం అని మనకు భ్రమలు కలిగించేలా ఉంటాయి. నాయకుల నటనా నైపుణ్యానికి మాత్రం వేల వేల జోహార్లు.