హైదరాబాద్: చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవిని కలిశారు. ఇవాళ చిరంజీవి జన్మదినం సందర్భంగా పవన్, అన్నయ్య ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ రాకతో చిరు ఇంటి దగ్గర ఉన్న మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అటు చిరంజీవి ఇంటిలోని కుటుంబసభ్యులు, బంధువులుకూడా ఆనందంలో మునిగిపోయారు. 45 నిమిషాలపాటు పవన్ చిరంజీవి ఇంట్లో గడిపారు. రాజకీయంగా వేర్వేరు పార్టీలలో ఉన్న చిరంజీవి, పవన్ ఇలా చాలాకాలం తర్వాత కలుసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్నకూడా శిల్పకళావేదికలో అభిమానులు జరిపిన బర్త్‌డే వేడుకల్లో పవన్ ఫ్యాన్స్ గొడవ చేయటం, దానిపై నాగబాబు మండిపడటం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ రాకతో ఇక అంతా సుఖాంతమైనట్లేనని అభిమానులు భావిస్తున్నారు. ఇవాళ సాయంత్రం పార్క్ హయత్ హోటల్‌లో జరిగే పార్టీకికూడా పవన్ హాజరవుతారని తెలిసింది.