ముంబయి వరుస బాంబుప్రేలుళ్ల కేసులో ఉగ్రవాది యాకూబ్ మీమన్ కి మరణశిక్ష (ఉరిశిక్ష) అమలుచేసే సమయంలో ఉరితీతపై పెద్దఎత్తునే చర్చలు జరిగాయి. ఇది అమానుషమనీ, మొరటైన ఆటవికచర్య అని కొంతమంది బాహాటంగానే విమర్శించారు. అయితే, కరడుగట్టిన ఉగ్రవాదకి మరణశిక్షే ఉచితమని చివరకు ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పడంతో యాకూబ్ ని పూణెజైల్లో ఉరితీశారు.
ఉరిశిక్షను ఎత్తివేయాలనీ, నేరస్థునికి అంతిమ శిక్షగా జీవితఖైది సరిపోతుందని వాదించేవారికి చెంపపెట్టుగా ఇప్పుడు మరోకేసులో సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం – మరణశిక్ష (ఉరిశిక్ష) అమానుషంకాదనీ, మొరటైన శిక్ష అంతకంటే కాదనీ చెప్తూ, దారుణదుశ్చర్యలకు పాల్పడినవారికి ఇది తప్పదని తేల్చి చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానం తాజా వివరణతో పౌరసమాజంలో ఇంతవరకు జరిగిన చర్చకు ముగింపు సమాధానంవచ్చినట్టుగానే భావించవచ్చా…?
మరణశిక్ష విధించిన కేసులోని దోషి తన శిక్షను తగ్గించాలంటూ అప్పీల్ చేసుకున్న నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం పై మేరకు వ్యాఖ్యానించింది. దోషి విక్రమ్ సింగ్ 16ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్యచేశాడు. ఈ కేసుపై విచారణ ముగిశాక అతనికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే, మరణశిక్ష అత్యంత కఠినమైనదనీ, అది కేవలం ఉగ్రవాద నేరాలకు పాల్పడినవారికి మాత్రమేనంటూ దోషి తరఫు న్యాయవాది వాదించారు. వాదోపవాదాలువిన్న తర్వాత సుప్రీం ధర్మాసనం వివరణ ఇస్తూ, దోషి చేసిన నేరం అత్యంత దుశ్చర్యనీ, దారుణంగా ఉందని పేర్కొంటూ, దోషికి మరణశిక్ష విధిస్తే అది ఆటవిక – మొరటైన శిక్షకానేకాదనీ,అమానుషం అంతకంటేకాదని తేల్చిచెప్పింది. ఇది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును ఉల్లంఘించినట్టు కాదని కూడా ధర్మాసనం వివరణ ఇచ్చింది.
మరణశిక్ష విధించడమన్నది చాలా అరుదైన కేసుల్లో అరుదైన సందర్బంలో జరుగుతుంటుంది. ఈమధ్య కాలంలో ఉగ్రవాద దుశ్చర్యలకు పాల్పడిన దోషుల విషయంలో మరణశిక్ష విధించడమూ, అమలుచేయడం జరగడంతో సాధారణ పౌరుల్లో ఈ అంతిమ శిక్ష కేవలం టెర్రరిస్టులకు మాత్రమే వర్తిస్తుందన్న భ్రమ ఏర్పడింది. 2001లో పార్లమెంట్ పై దాడికేసులో అప్ఝల్ గురుని, 26/11 ముంబయి ఎటాక్ కేసులో అజ్మల్ కసబ్ ని, ఈమధ్య ముంబయి వరుస బాంబుపేలుళ్ల కేసులో యాకూబ్ ని ఉరితీశారు.
కాగా, 2005లో అభివర్మ అనే విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్యచేసిన కేసులో విక్రమ్ సింగ్ అరెస్టయ్యాడు. విచారణ ముగిశాక పంజాబ్ -హర్యాణ హైకోర్టు విక్రమ్ ను దోషిగా ప్రకటిస్తూ మరణశిక్ష విధించింది. అయితే అతను ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం కూడా అదే తీర్పును ఖరారుచేసింది. చివరకు ముగ్గురు సభ్యుల ధర్మాసనం మరణశిక్షనే ఖరారుచేస్తూ ఈ అంతిమ శిక్ష అమలుచేయడమన్నది ఆటవికం, అమానుషం కాదని తేల్చిచెప్పింది.
సుప్రీం ఇచ్చిన ఈ వివరణతో మరణశిక్ష (ఉరి శిక్ష) పై తాజా తలెత్తిన డిబేట్ సమిసినట్టుగానే భావించవచ్చు.
-కణ్వస