ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమయిన భూములపై రాజధాని నిర్మాణం చేయాలనుకోవడం, దాని కోసం రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కోవడం, ఆ భూమిని సింగపూర్ సంస్థలకి ధారాదత్తం చేయాలనుకోవడం అన్నీ తప్పులే. ప్రభుత్వానికి సవాలు చేయగల అంశాలే. కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, వైకాపాలు రెండూ కూడా తెదేపా ప్రభుత్వాన్ని నిలువరించడంలో ఘోరంగా విఫలమయ్యాయి.
సున్నితమయిన రాజధాని భూసేకరణ విషయంలో తెదేపా, వైకాపాల వ్యూహాలు నిశితంగా గమనించినట్లయితే తెదేపా చాలా తెలివిగా వ్యవహరిస్తూ ముందుకుపోతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఈ విషయంలో జగన్ అసెంబ్లీలో, క్షేత్రస్థాయిలో కూడా చాలా గట్టిగానే పోరాడారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని నిలువరించలేకపోయారు. రైతుల కోసమే పోరాడుతున్నప్పటికీ కనీసం వారి నమ్మకం కూడా పొందలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశం భుజానికి ఎత్తుకొని ముందుకు సాగుతోంది కనుక ఈ సమస్యను పట్టించుకోలేదనుకొన్నా చాలా గంభీరమయిన ఈ సమస్యపై వైకాపా నిలకడగా పోరాటం చేయనందునే రైతుల నమ్మకం, విశ్వాసం పొందలేకపోయిందని చెప్పక తప్పదు. అందుకే ఈ వ్యవహారంలో తెదేపా ప్రభుత్వం అంత దైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతోంది.
అంతేకాదు భూసేకరణకు తీవ్ర అభ్యంతరం చెపుతున్న పవన్ కళ్యాణ్ చేతనే వైకాపాకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుంది. ఇంతకు ముందు జగన్ రాజధాని గ్రామాలలో పర్యటించేందుకు బయలుదేరుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరారు. మళ్ళీ ఈ నెల 26న జగన్మోహన్ రెడ్డి భూసేకరణకి వ్యతిరేకంగా రాజధాని ప్రాంతంలోనే నిరాహార దీక్ష చేపట్టబోతున్నారని ప్రకటించిన తరువాతే పవన్ కళ్యాణ్ వైకాపాకి పట్టున్న గ్రామాలలో పర్యటించి రైతుల తరపున పోరాడుతానని భరోసా కల్పించారు. అంటే జగన్ కంటే ఆయన (తెదేపా?) ఒకడుగు ముందు ఉందనుకోవాలా?
పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత రైతులతో నిన్న సమావేశం అవడం ద్వారా వారిప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొంటే మంచిదా లేక పవన్ కళ్యాణ్ న్ని నమ్ముకొంటే మంచిదో తెలియని గందరగోళ పరిస్థితి కల్పించారు. వారికోసం తను మద్దతు ఇస్తున్న తెదేపా ప్రభుత్వంతో పోరాడేందుకు తను సిద్దం అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ గత అనుభవం దృష్ట్యా ఆయన మళ్ళీ వచ్చి తమ తరపున నిలబడి పోరాడుతారో లేదో ఎవరికీ తెలియదు. కానీ అలాగని ఆయన నిజాయితీని, చిత్తశుద్ధిని శంఖించదానికి కూడా లేదు.
ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి “నేను కూడా రైతుల కోసం పోరాడుతానంటూ” ఈనెల 26న నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. కానీ గతానుభవాలను బట్టి చూస్తే ఆయన కూడా ఎంతకాలం రైతుల తరపున నిలకడగా పోరాడుతారో ఎవరికీ తెలియదు. తన పార్టీకి మంచి రాజకీయ మైలేజి నిచ్చే ఓటుకి నోటు కేసు వంటి మరో అంశం దొరికితే మళ్ళీ ఆయన దానికి షిఫ్ట్ అయిపోవడం తధ్యం. కనుక రైతులు ఈ ఇద్దరిలో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అతి క్లిష్టమయిన ఈ వ్యవహారాన్ని అంత తెలికగ్గా తనదయిన శైలిలో చక్కబెట్టుకొంటూ ముందుకు వెళ్ళిపోతోంది. కానీ మధ్యలో రైతులే అన్యాయం అయిపోతున్నారు. రైతులకు అన్యాయం జరిగితే దానికి ప్రభువత్వం ఎంత బాధ్యత వహించాలో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కూడా అంతే బాధ్యత వహించాల్సి ఉంటుంది.