అనగనగా ఒక అబ్బాయి. పెళ్ళీడొచ్చింది. తనకు కాబోయే భార్య అంజలీదేవిలాగా మోహనంగా ఉండాలనుకునేవాడు.
అనగనగా ఒక తమ్ముడు. తన వదినగారు అచ్చు అంజలీదేవిలా ఆత్మీయంగా ఉందని మురిసిపోయేవాడు.
అనగనగా ఒక కొడుకు. తన తల్లిలో అంజలీదేవి పంచిన తల్లిప్రేమను చూసి ఒప్పొంగిపోయాడు.
అనగనగా ఒక మనవడు. తన నానామ్మలో అంజలీదేవి పోలికలున్నాయని తెగ సంబరపడిపోయేవాడు.
అనగనగా ఓ భక్తురాలు. తాను నిత్యం కొలిచే సీతమ్మతల్లిలో అంజలీదేవి పోలికలున్నాయని పరమానందంగా చెప్పేది.
అనగనగా ఓ నృత్యకళాకారిణి. అంజలీదేవి నృత్యాన్ని అభినయించి ప్రశంసలు అందుకుంది.
అనగనగా ఓ నటి. `అక్కా నేను ఎప్పటికైనా నీ అంతటి నటినవుతానా?’ అంటూ సెట్స్ లో ఉన్నప్పడు తరచూ అడిగేది. ఆ తర్వాత ఆమె మహానటి అయింది.
అనగనగా ఓ అంజలీదేవి…
ఆమెకు ఆమేసాటి. మరెవ్వరితోనూ పోల్చలేని వ్యక్తిత్వం, నటన, నృత్యం…
తెలుగునాట సినీరంగం వేళ్లూనుతున్న తరుణంలో మెరిసిన సువర్ణసుందరి. పదేళ్ల వయసులో తొలిసారి స్టేజిఎక్కి లోహితాస్యుడు పాత్రపోషించారు. ఇలా తలపాగా చుట్టుకుని మగపిల్లాడిపాత్రతో నటనకు శ్రీకారం చుట్టారు. అమ్మానాన్నలు పెట్టిన పేరు అంజనీకుమారి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పుట్టారు. అంజలీదేవి జీవితంలోని కొన్ని విశేషాలు.
-తొలినాళ్లలో కాకినాడ యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ లో చేరినతర్వాత అనేక నాటకాల్లో నటించారు. వాటిలో కొన్ని ఆదినారాయణరావు దర్శకత్వం వహించినవి కూడా ఉన్నాయి.
– 1941లో మద్రాసులో జరిగిన ఆంధ్రనాటక కళాపరిషత్ లో `ఆంధ్రశ్రీ’ నాటకంలో మాంచాల పాత్రపోషించి ఉత్తమనటి అవార్డు అందుకున్నారు. అప్పటికి ఆమె వయసు 14ఏళ్లు.
– విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన `వేమరాజు’ నాటకంలో నటించారు.
– 1943లో డిసెంబర్ లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ విశాఖపట్నం వచ్చినప్పుడు అంజలీదేవి నాట్యప్రదర్శన చూసి ఆమె నాట్యతీరుని ప్రశంసించారు.
– బొంబాయి అల్లర్లలో ప్రాణభయంతో ఇబ్బందులు పడాల్సివచ్చింది. 40వ దశకంలోనే ఎల్ వి ప్రసాద్ దర్శకత్వంలో టి.సుబ్రహ్మణ్యశాస్త్రి `మేనకోడలు’పేరిట చిత్రం తీయాలనుకున్నారు. ఇందులో నటించాలంటూ అంజలీదేవికి బొంబాయి నుంచి కబురొచ్చింది. తండ్రితో కలిసి బొంబాయి వెళ్లారు. అయితే ఎంతకీ పిలుపురాలేదు. ఇంతలో బొంబాయిలో అల్లర్లు చెలరేగడంతో చేతిలో డబ్బుల్లేక చేతిగాజులు అమ్మేసి టికెట్లు కొనుక్కుని వెనక్కి వచ్చేశారు. ఈ కష్టసమయంలో ఆమె కుటుంబాన్ని ఆదినారాయణరావు ఆదుకున్నారు. కాకినాడలోని తన యంగ్ మెన్ హ్యాపీక్లబ్ లో నెలకు వందరూపాయల జీతంతో అంజలీదేవిని ఆర్టిస్ట్ గా నియమించారు.
– వీధిగాయకులు అనే నాటకం అప్పట్లో సూపర్ హిట్. ఇందులో పాటలకు అంజలీదేవి అద్భుతంగా నృత్యంచేశారు. ఆ సమయంలోనే అంజలీదేవి – ఆదినారాయణరావులపై గుసగుసలు వినిపించేవి. వారిద్దరూ బాగా సన్నిహితంగా మెలిగేవారు. ఇద్దరూ ఒక నిర్ణయానికివచ్చి వివాహంచేసుకున్నారు. ఆదినారాయణరావుగారికి అప్పటికే పెళ్లయింది. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలుండేవారు.
– చిత్తూరి నాగయ్య పిలుపుతో అంజలీదేవి మద్రాసు వెళ్ళి గొల్లభామ (1947)లో నటించారు. `ఈ పొట్టిపిల్ల ఎక్కడ దొరికిం’దంటూ సినీవర్గాల్లో చాలామంది చెవులుకొరుక్కునేవారట. అయితే అందులో మోహిని పాత్రను పోషించిన తీరుచూసి అంతా ఆశ్చర్యపోయారని చెబుతుండేవారు.
– 1948లో బాలరాజు సినిమా సూపర్ హిట్. అందులో ఏఎన్నార్, ఎస్.వరలక్షీ హీరోహీరోయిన్లే అయినా అంజలీదేవికి పాత్ర లభించింది. ఇంద్రసభలో నాట్యంచేసే యక్షిణి పాత్ర అది. ఈ యక్షిణే ఇంద్రుని శాపం కారణంగా మానవకాంతగా (ఎస్. వరలక్ష్మి)గా పుడుతుంది. ఈ సినిమాలో అంజలీదేవి నృత్యం చూసితీరాల్సిందే. వక్కలంక సరళ పాడినపాటకు (ఈ తీయని వెన్నెల రేయి) అంజలీ హోయలుబోతూ చేసిన నాట్యం ప్రేక్షకజనాన్ని ఊర్రూతలూగించింది.
– వాహినీవారి కీలుగుర్రంలో కూడా అంజలీదేవిది హీరోయిన్ పాత్రకాదు. రాక్షసి మాయారూపంలో కనిపించే వ్యాంప్ పాత్ర ఇది. అయినా ఆ పాత్రచేయడానికి అంగీకరించి అందరి మన్ననలు అందుకున్నారు.
– 1950లో ప్రతిభావారి స్వప్నసుందరి సినిమాలో దేవకన్యలా ప్రత్యక్షమై తెలుగుప్రేక్షకులను మైమరిపించారు. ఈ సుందరి పక్కన అందాల నటుడు అక్కినేని రాకుమారునిగా నటించారు.
– చలాకీగా `పల్లెటూరి’ పిల్లలో నటించి, `పక్కింటమ్మాయి’గా మరింత హుషారు పెంచారు అంజలీదేవి. ఆ తర్వాత హీరోయిన్ గా స్థిరపడ్డాక సొంతంగా సినిమాలు తీయడం ప్రారంభించారు. సొంతబ్యానర్ మీద అక్కినేనితో కలసి `పరదేశి’ సినిమా తీశారు. అటుపైన అనార్కిలి సినిమాతీసి అద్భుతవిజయం సాధించారు. 1957తర్వాత ఆమె చేసిన సినిమాలు ఒక్కొక్కటీ ఒక్కో ఆణిముత్యమే.
-`సతీఅనుసూయ’, `చెంచులక్ష్మి’ మరువలేని చిత్రాలు. అంజలీ పిక్చర్స్ నిర్మించిన `సువర్ణసుందరి’ అంజలీదేవి లావణ్యానికీ నటనకు గీటురాయిగా నిలిచింది.
– 60వ దశకంవరకు ఆమె హీరోయిన్ గా ఉన్నారు. వయసుపెరగడంతో పాత్రలఎంపిక విషయంలో మెలుకువలు ప్రదర్శించారు. ఆ సమయంలోనే ఆమె `లవకుశ’ సినిమాలో సీతగా ఒదిగిపోయారు. ఆ సినిమా చూసిన తర్వాత అంజలీదేవి ఎక్కడ కనిపించినా ఆమెను సీతమ్మతల్లిగానే భావించి దండాలుపెట్టేవారు. `ఎన్నికష్టాలు పడ్డావే నా తల్లీ’ అంటూ పెద్దలు ఓదార్చేవారట.
– పెద్దరికంలో `బడిపంతులు’ సినిమాలో అంజలీదేవి ముసలి దంపతుల్లో భార్యగా ఎన్టీఆర్ పక్కన నటించారు. `నీ నగుమోము, నా కనులారా, కడదాకా కననిండూ…’ అన్న పాట ఇప్పుడువిన్నా భావోద్వేగానికి గురికావాల్సిందే.
– 240కిపైగా చిత్రాలు నటించారు. 1994లో పోలీస్ అల్లుడు సినిమాలో నటించిన తర్వాత మళ్ళీ ఏ సినిమాలోనూ ఆమె నటించలేదు.
– ఆమె కుమారులిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. అంజలీదేవి 2014 జనవరి 13న కన్నుమూశారు. వెండితెర అభిమానులకు అజరామర స్మృతులను విడిచి వెళ్లిపోయిన మహోన్నత వ్యక్తి అంజలీదేవి జయంతి (24-08-1927) సందర్భంగా `జీవితమే సఫలము రాగసుధా భరితము…..ప్రేమ కథ. మధురము…’ అని పాడుకుంటూ ఆమెకు అందిస్తున్న కుసుమాంజలి ఇదే.
– కణ్వస