ప్రముఖ నిర్మాత దిల్ రాజు మొట్టమొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయబోతున్నారు. ఈ విషయం ఆయనే స్వయంగా ఈరోజు హైదరాబాద్ లో ప్రకటించారు. అయితే ఈ సినిమాకి ఇంకా దర్శకుడు, కధని ఎంచుకోవలసి ఉందని తెలిపారు. సాధారణంగా దర్శకుడు హీరో, నిర్మాతలకి కధ చెప్పిన తరువాత అది వారికి నచ్చినట్లయితే ముందుకు వెళతారు. చిరంజీవి తన 150వ సినిమా కోసం చాలా కధలు విన్నారు. చివరికి దర్శకుడు పూరీ జగన్నాద్ చెప్పిన కధలో మొదటి భాగం వరకు ఒప్పుకొన్నా రెండవ భాగం నచ్చకపోవడంతో వారి సినిమా అటకెక్కినట్లే ఉంది. పూరీ కూడా వేరే సినిమాకి వెళ్ళిపోయారు. త్వరలో పూరీ వచ్చి తనకు రెండవ భాగం చెపితే ఆయనతో సినిమా చేస్తానని లేకుంటే తను వేరే సినిమాకి కమిట్ అయిపోతానని చిరంజీవి తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ అయన సోదరుడు పవన్ కళ్యాణ్ మాత్రం కధ వినకుండానే, దర్శకుడి ఎవరో తెలియకుండానే నిర్మాత దిల్ రాజుపై నమ్మకంతో సినిమా చేయడానికి అంగీకరించారు.
పవన్ కళ్యాణ్ తో తను చేయబోయే సినిమాకి కధ, దర్శకుడు ఎంపిక పూర్తయితే తమ సినిమా వివరాలను తెలియజేస్తానని దిల్ రాజు మీడియాకి తెలిపారు. తనకు చిరంజీవి 150వ సినిమాకు నిర్మాతగా ఉండాలని ఉన్నప్పటికీ రామ్ చరణ్ తేజ్ స్వయంగా నిర్మిస్తున్నందున ఆ అవకాశం దక్కలేదని కానీ ఆ సినిమా నైజాం ఏరియా పంపిణీ హక్కులను తనే తీసుకొంతానని తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సీక్వెల్ గా తీస్తున్న సర్దార్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోగా దిల్ రాజు తమ సినిమాకు దర్శకుడిని, కధని సిద్దం చేసుకోవచ్చును.