ప్రత్యేక తరగతి హోదానా లేక ప్రత్యేక ప్యాకేజీనా అన్న చర్చకంటే ముందుగా కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి అందజేసిన అదనపు సహాయంపై రెండు ప్రభుత్వాల లెక్కలకీ మధ్య కనీసం నాలుగురెట్లు తేడావుంది. విభజనచట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో రెవిన్యూలోటును కేంద్రం భర్తీచేయాలి. ఈ ప్రకారం కేవలం ఈ పద్దుకిందే రాష్ట్రానికి 14 వేలకోట్లరూపాయలు రావలసి వుంది.
అన్నిరకాల సహాయాలూ కలిపి విడుదల అయ్యింది కేవలం 8 వేలకోట్లరూపాయలు మాత్రమేని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. అయితే, బాహాటంగా వెల్లడించకపోయినప్పటికీ కేంద్ర ఆర్ధికమంత్రిత్వ శాఖ లెక్కలు మరోలా వున్నాయి. సాధారణ నిధులకంటే అదనంగా విడుదల చేసిన నిధుల వివరాలను ఆశాఖ ప్రధానమంత్రి కార్యాలయానికి పంపింది. ఆలెక్కల ప్రకారం ఏడాదిలో 45 డిపార్టమెంటుల ద్వారా 65 వేలకోట్ల రూపాయల అదనపు నిధులు మంజూరు చేశారు. అందులో 23 వేలకోట్ల రూపాయలు విడుదల చేశారు.
ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజి విషయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశంలో అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 200 పేజీల నివేదిక తయారుచేయించుకున్నారు. మిగిలిన విషయాలు ఎలావున్నా ప్రధాని, ముఖ్యమంత్రి సమావేశంలో ఆర్ధికాంశాల నివేదికల మార్పిడి తప్పక జరుగుతుంది.
ఇలా వుండగా ”ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేలెక్కలకు విశ్వసనీయత లేదు, అవి నిజమే అయితే ప్రత్యేక తరగతి హోదా పొందే అర్హత ఎపి కి వుండదని”బిజెపిలో ప్రముఖ నాయకుడు ఒకరు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ ఎంతవుందో విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంచుమించు అంతే బడ్జెట్ ను పెట్టారు. ఆర్ధిక వనరులే లేకుండా ఇంత పెద్ద బడ్జెట్టు ఎలా సాధ్యం అని ఆయన ప్రశ్నించారు.
“హుద్ హుద్ తుపానుకి 60 వేలకోట్లరూపాయల నష్టమన్నారు. ఆమాటల తీవ్రత దృషా్ట్య మోదీ 1000 కోట్ల రూపాయల తక్షణ కేంద్ర సాయం ప్రకటించారు. రొటీన్ గా అధికారులు జరిపే ఆడిట్ లో చెప్పినంత నష్టం లేదని తేలింది. 400 కోట్లరూపాయలు విడుదల చేశారు. చివరి లెక్కలు తేలాక మరో 250 కోట్లరూపాయలు విడుదల చేశారు. ఏదైనా నియమాల ప్రకారమే జరుగుతుంది.ఎపి అతిశయోక్తివల్ల మాటతప్పారన్న అన్యాయమైన నింద మోదీకి మిగిలింది” అని ఆనాయకుడు ఉదాహరించారు.
రాష్ట్రం అంతగా ఆర్ధిక సమస్యలతో వున్నప్పుడు గోదావరి పుష్కరాలకు 1600 కోట్లరూపాయలు ఎలాఖర్చపెట్టగలిగారు అని బిజెపి జాతీయకార్యవర్గ సభ్యుడు, రాష్ట్రశాసనమండలిలో సభ్యుడు సోమువీర్రాజు ఇప్పటికే పత్రికాముఖంగా ప్రశ్నించారు.
ప్రత్యేక తరగతి హోదా అసాధ్యమని రాష్ట్రబిజెపికి తెలుసు. ఈవిషయం తెలుగుదేశం పార్టీ కూడా గ్రహించింది. ఏంపేరు పెట్టినా ఎపికి భారీనిధుల అవసరమని ఈ రెండుపార్టీలూ అంగీకరిస్తున్నాయి. అలాగే ఇప్పటికే ఒక ఆత్మాహుతికి దారితీసిన ప్రత్యేక హోదా ప్రజల్లో సెంటిమెంటుగా మారిపోతుందని రెండు పార్టీలూ భయపడుతున్నాయి.
దీనికి ప్రత్యామ్నాయాన్నీ, పరిష్కారాన్నీ కనుగొనడానికే నరేంద్రమోదీ, చంద్రబాబుల సమావేశం దోహదపడుతుంది. ‘ప్రత్యేకహోదా, లేదా ప్యాకేజీ’ విషయమై దేశాధినేత, రాషా్ట్రధినేతల మధ్య చర్చలు ఇప్పటికిప్పుడే అమీతుమీ తేలిపోయేలా మాత్రం వుండవు. ఉభయులకూ అవసరమైన సంకీర్ణ సంబంధాల దృషా్ట్య డిమాండుకీ-మధ్యేమార్గానికీ-మంజూరుకీ తలుపులు కొంతకాలమైనా తెరిచే వుంచేలా సమావేశం ముగుస్తుంది.