ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇతర హామీలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉద్యమిస్తున్నాయి. కనుక ఇవే విషయాలపై చర్చించేందుకు ఇవ్వాళ్ళ ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10.30 గంటలకు సమావేశం కానున్నారు. బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మోడీ ఆ రాష్ట్రానికి రూ.1.25 లక్షల ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, రాష్ట్రంలో మౌలికవసతుల అభివృద్ధి కోసం మరో రూ.40, 000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. కనుక రాష్ట్ర విభజనతో పూర్తిగా దెబ్బ తిన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో బాటు బీహార్ కి ప్రకటించిన ప్యాకేజి కంటే మంచి ఆర్ధిక ప్యాకేజి కూడా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కోరబోతున్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వదలచుకొన్న ఆర్ధిక ప్యాకేజిని కేంద్రప్రభుత్వం ఇప్పటికే సిద్దం చేసినట్లు సమాచారం. నేడు దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేనట్లు కేంద్రప్రభుత్వం స్పశాతమయిన సంకేతాలు ఇస్తోంది. కారణాలు ఏవయినప్పటికీ ప్రత్యేక హోదా హామీని మోడీ ప్రభుత్వం అమలుచేయకపోతే దాని వలన రాష్ట్రంలో బీజేపీకి దానికి మిత్రపక్షంగా ఉన్నతెదేపాకి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానితో సమావేశం ముగుసిన తరువాత వరుసగా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి మనోహర్ పరికర, వ్యవసాయ శాఖా మంత్రి రాధామోహన్ సింగ్ తదితరులతో సమావేశాలు అవుతారు. ఆయన తిరిగి బుదవారం విజయవాడకు చేరుకొంటారు.