వయోభారం, పని భారం కలగలసి సీనియర్ కేంద్ర మంత్రి, బిజెపి అగ్రనేత వెంకయ్య నాయుడు ఇటీవల వూరికే ఉడికిపోతున్నారు. ఉద్రేకపడుతున్నారు. అంత అనుభవం గల నాయకుడు అయినదానికి కాని దానికి ఏకపక్షంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడటం వల్ల వచ్చే మైలేజీ కన్నా డామేజీ ఎక్కువని అర్థం చేసుకోలేకపోవడం ఆశ్చర్యమే. ఈ ఆగ్రహౌదగ్రులై ఆయన సంధించే వాగ్బాణాలు సంధించడంలో సంయమనం కోల్పోతే రాజకీయ మూల్యం చెల్లించవలసింది బిజెపి మాత్రమే. అసలు ఆ పార్టీకి వున్న బలమే పరిమితం. దాన్ని విస్తరించుకోవడమెలాగని తాము తంటాలు పడుతుంటే అగ్రనేత ఆవేశకావేశాలు అనవసర ప్రశంసలు ఇరకాటం తెచ్చిపెడుతున్నాయని తెలుగు రాష్ట్రాల నాయకులు వీరు వాపోతున్నారు. హెచ్‌సియు,జెఎన్‌యు వివాదాలు వచ్చినప్పుడు వెంకయ్య తన వయస్సునూ హౌదాను మరచిపోయి ఆ విద్యార్థి నేతలపై విమర్శలు గుప్పించారు. కన్నయ్య కుమార్‌ను హీరోను చేశారని అక్కసు వెలిగక్కారు.
తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హౌదా ప్రహసనం నడిచింది. దానికి మంగళం పాడుతున్నారని కథనాలు వస్తుంటే వాటిపై దాడి చేసి ఇంకా పరిశీలనలో వుందని పదే పదే చెబుతూ వచ్చారు.(2015 డిసెంబరు చివర వరకూ!) తీరా ఆ తిరస్కరణ ఘట్టం ముగిసిపోయాక ఇప్పుడు ఇంకో విధంగా దాడి కొనసాగిస్తున్నారు. అంత పెద్ద నాయకుడు అన్ని టీవీలకూ ఒకటికి రెండు సార్లు తిరిగి సమర్థించుకోలేక నానాపాట్లు పడ్డారు. ఎంత చేసినా ఈ సమర్థనలు ప్రజలను మెప్పించిందేమీ లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ కెసిఆర్‌లపై స్థానిక నాయకులు ఏవో విమర్శలు చేస్తుంటే వెంకయ్య నాయుడు దిగిపోయి కితాబులు కుప్పించడం ఇంకో సమస్యగా మారింది.
ఇక ఇప్పుడు భారత పాక్ సమస్యలోనూ ప్రతిపక్షాలపై ఆయన అదే విధంగా దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ బిజెపిల మధ్యనే రాజకీయాలు నడిచే ఉత్తర భారతానికి దక్షిణాన అందులో తెలుగునాట రాజకీయ భావనలకు చాలా తేడా వుంటుంది. అరవింద్ కేజ్రీవాల్నో రాహుల్‌గాంధీనో సర్జికల్ స్ట్రయిక్స్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించడం వేరు. అలా అన్నందుకు వారు పాకిస్తాన్ ఏజంట్లుగా వర్ణించడం వేరు. వెంకయ్య నాయుడు ఒకటికి రెండు సార్లు వారంతా పాక్ ఏజంట్ట భాష మాట్లాడుతున్నారని ఆరోపించడం ఆ పార్టీవారే సమర్థించలేకపోతున్నారు. రాజకీయ విమర్శలకూ విద్వేష వ్యాఖ్యలకూ తేడా వుంటుంది. తన కోపమె తన శత్రువు అన్నట్టు వెంకయ్య నాయుడు అనేక కారణాల వల్ల అసహనానికి గురై చేసే ఈ వ్యాఖ్యలు తమకు రాజకీయంగా నష్టం చేస్తాయని కొందరు బిజెపి ముఖ్యులే ఆందోళన వ్యక్తం చేయడం ఆసక్తికరం. మరి పెద్దాయన ఏమైనా పునరాలోచించుకుంటారా లేక మరింత రెచ్చిపోతారా? చూడాలి!