కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్ళు నానబెట్టి నానబెట్టి చివరికి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరహా హోదా లేదని తేల్చేశాయి. ఈ వాగ్దాన భంగానికి, రెండు పార్టీల ద్రోహానికి ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారో, క్షమించి విడిచిపెడతారో 2019 ఎన్నికలలోగానీ, స్పష్టం కాదు.
అయితే, ఈ లోగా ఎంతో కొంత అభివృద్ధి కూడా జరుగుతుంది. అందుకు రూపొందించే ప్రణాళికలు, వ్యూహాలు వాటిని అమలు చేసే చిత్తశుద్ధి, నిధుల అందుబాటు, సామాజిక ప్రశాంతత, రాజకీయ అనుకూలతలను బట్టే ఫలితాలను ఇస్తాయి. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ల గా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకున్న కార్యాచరణలో చంద్రబాబు ముద్ర మాత్రమే కనబడుతోంది. ఈ బ్లూప్రింటులో టెర్మినాలజీ కూడా గమ్మత్తుగా ఒక విధమైన ఆకర్షణతో కనబడుతోంది. ఈ పదజాలమంతా అంతర్జాతీయ ద్రవ్యసంస్ధలు అర్ధం చేసుకునే భాషలో తయారైనవే!
వీటి అమలులో ప్రజలు పాస్ మార్కులు వేస్తే మరోసారి బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం వుంది. అయితే ప్రణాళిక అమలు మొదలైన దశలోనే “ఆర్ధిక పరిస్ధితి ఏమాత్రం బాగోలేదన్న ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పెదవి విరుపు పెద్ద కష్టాన్నే సూచిస్తూండగా దాన్ని బాబు సారధ్యం ఎలా అధిగమించగలదన్నదే కుతాహలాన్ని రేకెత్తించే విశేషం!
ఈ వార్తా వ్యాసంలో అంశాలు సాధారణ పాఠకులకు ఆసక్తి కలిగించకపోయినా, రాష్ట్రాభివృద్ధి ని గమనించే పరిశీలకులకు, విశ్లేషకులకు, ఆర్ధికాంశాల నిపుణులకు, రాజకీయపార్టీల కార్యకర్తలు, నాయకులకు ఒక బేస్ సమాచారం కాగల అవకాశం వున్నందున ఆ రిఫరెన్స్ విలువను దృష్టిలో వుంచుకుని తెలుగు360డాట్ కామ్ రాష్ట్రప్రభుత్వ స్ట్రాటజిక్ బ్లూ ప్రింటుని ఇక్కడ ప్రచురిస్తోంది.
రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చేందుకు ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లతో కార్యాచరణ ఆరంభించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణతో ముందడుగేస్తోంది. రాష్ట్రాన్ని సంతోషాంధ్రగా, సమగ్ర అభివృద్ధి దిశగా, బాధ్యతాయుతమైన, ప్రపంచంలోనే మేటి పోటీదారుగా, నూతన ఆవిష్కరణల సృష్టించే దిశగా, రెండంకెల స్థిరమైన అభివృద్ధి దిశగా… రాష్ట్రాన్ని 2022 నాటికి దేశంలోనే మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. 2029 నాటికి దేశంలోనే నెంబర్ వన్ గా చేయడం, 2050 నాటికి ప్రపంచ పెట్టుబడులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చాలని సర్కారు భావిస్తోంది. అందుకోసం నాలుగు ప్రణాళికలు రూపొందించింది.
1) 6 కీలకమైన రంగాల్లో మార్పులు తీసుకురావడం
2) సమగ్ర అభివృద్ధి కోసం 12 ముఖ్యమైన అత్యవసరాలు కల్పించడం
3) వృద్ధిని రూపాంతరం చేసేందుకు అనుసరించాల్సిన 12 వ్యూహాలు
4) త్వరగా అభివృద్ధి చెందేందుకు అస్కారమున్న వృద్ధి రంగాలు 12
రాష్ట్రంలో వృద్ధి ద్వారానే అభివృద్ధి పంథాలో తీసుకెళ్లగలమని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే కొత్త రాజధానితో నవ్యాంధ్ర నిర్మాణానికి నడుంబింగించిన సీఎం రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని ప్రజలను అభివృద్ధి పంథాలో తీసుకెళ్లేందుకు 12 సూత్రాల ప్రణాళిక నిర్దేశించుకొంది. 12 అంశాలను ఏవిధంగా అభివృద్ధి చేయోచ్చన్నదానిపై విధానాలను ఖరారు చేశారు. త్వరతగతిన అభివృద్ధి చేయడానికి ఆస్కారమున్న రంగాలు, సామాజిక ఆర్థికంగా చేయాల్సిన చర్యలు, అధిక వృద్ధికి అస్కారమున్న రంగాలుగా విభజించారు.
తక్షణం అభివృద్ధికి సాధ్యమైన రంగాలు
1) సమగ్ర అభివృద్ధికి వ్యవసాయాధార వ్యాపారం (అగ్రిబిజినెస్)
2) మత్స్యశాఖ (ఫిషరీస్)
3) ఎంఎస్ఎంఈ(ఎస్) మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్
4) తక్కువ పనితనమున్న కార్మికులు (లో స్కిల్ లేబర్) (ఇంటెన్సివ్ మ్యానిఫ్యాక్చరింగ్)
సామాజిక అభివృద్ధి నిర్దేశకాలు
5) ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్
6) లైఫ్ లాంగ్ ట్రైనింగ్ ఆఫ్ మ్యాన్ పవర్
7) ప్రొడెక్టివ్ సిటీస్ –గ్రోత్ క్లస్టర్లు
8) ఇన్ ఫ్రాస్ట్రక్చర్
హై గ్రోత్ ప్రొవైడింగ్ సెక్టార్స్
9) కారిడార్స్
10) లాజిస్టిక్స్ అండ్ పోర్ట్ లెడ్ గ్రోత్
11) టూరిజం
12) హౌజింగ్
వృద్ధిని వేగవంతంగా చేసేందుకు తక్షణం వృద్ధి చెందే అవకాశమున్న పరిశ్రమలు
1) సమగ్ర వృద్ధికి వ్యవసాయ వ్యాపారం
- హార్టికల్చర్ పంటల నష్టాన్ని 5 శాతం వరకు తగ్గించడం
- వ్యవసాయపద్ధతుల్లో మార్పు తీసుకురావడం, పలనా పంట పండించడం, పంట చేతికివచ్చిన తర్వాత ఆ ఉత్పత్తులను సమర్థవంతమైన మౌలిక సదుపాయాలను వినియోగించుకొని మార్కెట్ కు తరలించడం
- 25 బ్రాండింగ్ ఉత్పత్తులను ఎంపిక చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీల సాయంతో మార్కెట్లోకి ప్రవేశించడం
2) రెవిన్యూ కోసం చేపల ఎగుమతులు
- దేశంలోనే 1.8 మిలియన్ టన్నుల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ప్రపంచంలోనే ద బెస్ట్ గా ఖ్యాతి పొందడం
- చేపలను ప్రాసెస్ చేయడంతోపాటు, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దడం
- క్వాలిటీ కంట్రోల్, ప్యాకేజింగ్, అమ్మకందారు-కొనుగోలుదారు వ్యవస్థ సమర్థవంతంగా ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం
3) మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ ద్వారా ఉద్యోగాల వెల్లువ
- మైక్రో స్మాల్ మీడియం కంపెనీల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో 25 వేల ఉద్యోగాల కల్పన.
- రాష్ట్రంలో ఈ రంగంలో కొత్తగా ఉద్యోగాల కల్పన ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగాల సంఖ్యలో అది పది శాతంగా ఉండాలి.
- కార్మిక చట్టాలు, రెగ్యులేషన్ వ్యవస్థలో సమూల మార్పులు, రిజిస్ట్రేషన్ వ్యవస్థ సరళీకరణ, ఆర్థిక తోడ్పాటు, స్టార్టప్ కంపెనీలు, స్కిల్ డెవలెప్మెంట్ రూపంలో పలు ఉద్యోగాల కల్పన
4) నైపుణ్యతలేని కార్మికులతో భారీ ఉత్పాదన
- వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, గార్మెంట్స్, లెదర్, ఫర్నిచర్ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలను కల్పించడం.
- కీలక రంగాల్లో ప్రైవేటు పెట్టుబడలను వచ్చేలా చేయడం.
- సరైన ధరలకు మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ సపోర్ట్ అభివృద్ధి చేయడం
- పెద్ద స్థాయి కంపెనీలకు రెగ్యులేషన్, పాలసీ మద్దతు అందించడం
అభివృద్ధిలో సామాజిక కోణం…
5) చిన్నతనం నుంచే అభివృద్ధి ఆలోచనలు
- పిల్లలలో శారీక వృద్ధితోపాటు బుద్ధిబలం, భావోద్వేగాలను పెంపొందించడం ద్వారా రాష్ట్రం ప్రగతికి పరోక్షంగా బాటలు వేయడం
- వంద శాతం ఆరోగ్య భద్రత కల్పించడం, గర్బిణీల ప్రసవం ఆసుపత్రుల్లోనే జరిగేలా చూడటం, 2019 నాటికి పూర్తి స్థాయిలో వ్యాధి నిరోధక టీకాలను వేయడం
6) నేర్చుకున్న ప్రతిభాపాఠవాలు జీవితాంతం గుర్తుండిపోవాలి
- రాష్ట్రంలోని కాలేజీలు, ఐటీఐలు, పాలిటిక్నిక్ కాలేజీల్లో విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడం…
- ఆ విద్య సమర్థవంతంగా ఉపయోగపడేలా ఉండటం
- నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ ను అమలు చేయడం
7) పరిశ్రమలు, విద్య, ఉపాధితో ఒక చైన్ ఏర్పాటు చేయడం
- ఆర్థిక వృద్ధి కోసం నగరాలను ఉత్పత్తి ప్రేరకాలుగా మలచడం
- రాష్ట్రంలోని ప్రతి పట్టణ ప్రాంతం స్థితిగతులను అధ్యయనం చేయడం, సాధారణ పౌర జీవనం, ఉద్యోగాల కల్పన చేయగలిగినవి, రాష్ట్ర వృద్ధి పెరిగేందుకు దోహదారిగా నిలిచేవి.
- నగరాల్లోకి పెట్టుబడులు వచ్చేందుకు ఒక చక్కటి వాతావరణం ఏర్పాటు చేయడం
- సమర్థవంతమైన పట్టణ ప్రణాళికతో ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం, వ్యర్థాలను సద్వినియోగం చేయడం, విపత్తుల నిర్వహణ, పౌర సేవలను సమర్థవంతంగా అందించడం చేయాల్సి ఉంది.
8) మౌలిక సదుపాయాల కల్పన
- కొత్త రహదారుల నిర్మాణం, రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల కి.మీ తో హైవేల విస్తరణ.
- రాష్ట్రంలో ఉన్న 15 వేల కి.మీ రహదారులను మెరుగుపరడచడం, భారీగా సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడం, ఏడాదికి 550 మిలియన్ టన్నుల దిశగా సరుకు రవాణ.
- 5 కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం. 2029 నాటికి రాష్ట్రంలోని గిడ్డంగులు, స్టోరేజ్ వ్యవస్థను 62.9 మిలియన్ టన్నులకు పెంచడం.
- విజయవాడ మెట్రో రైలును 3 ఏళ్లలో పూర్తి చేయడం.
అధిక వృద్ధికి ఆస్కారమున్న వృద్ధి కారకాలు
9) నిర్మాణాలు, గృహనిర్మాణం
- 2022 నాటికి రాష్ట్రంలో ఉన్నవారందరికీ ఇళ్ల నిర్మాణం…
- ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి పట్టణ ప్రాంతాల్లో 40 లక్షల ఇళ్ల నిర్మాణం
- భూమి తేలిగ్గా అందుబాటులో ఉండేలా చేయడం, సింగిల్ విండోలో అనుమతులు, తేలిగ్గా రుణాల మంజూరు, అద్దె విధానాల్లో ప్రమాణాలను పూర్తి స్థాయిలో మార్చడం
10) లాజిస్టిక్స్
- పోర్టులకు రాష్ట్రంలోని రోడ్డు, రైలు, నదుల ద్వారా కనెక్టివిటీని ఏర్పాటు చేయడం
- పార్కులు, సరకు రవాణా గ్రామాలను ఒక క్రమపద్ధతిలో ఒక విధానం ద్వారా అభివృద్ధి చేయడం.
- కొత్త ఓడరేవుల అభివృద్ధి అమలు చేయడం
- ఏడాదిలో సరుకు రవాణా 550 మిలియన్ టన్నుల లక్ష్యం చేరడం
- 2029 నాటికి పోర్టుల చుట్టూ అభివృద్ధికి గీటురాయిగా నిలవాలి.
11) టూరిజం
- ప్రపంచంలోనే పర్యాటక కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం
- పది లక్షల కొత్త ఉద్యోగాల కల్పన చేయడం
- 2029 నాటికి పర్యాటర రంగంలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం
- రాష్ట్రంలో పర్యటించిన యాత్రికులకు మధురానుభూతిని కలిగించడం
- గ్రోత్ కారిడార్స్, ఇండస్ట్రియల్ నగరాలు
12) రాష్ట్ర వృద్ధిని పెంచడం. కారిడార్ల ద్వారా ఉద్యోగల కల్పన
- సహజసిద్ధంగా క్లస్టర్లను ఏర్పాటు చేయడం, పరిశ్రమల మధ్య పోటీ తత్వం పెంపొందించడం.
- పరిశ్రమల అనుమతికి సింగిల్ విండో విధానం ఏర్పాటు చేయడం.
- పాలనలో సంస్కరణలతో ప్రభుత్వంతో చర్చల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిశ్రమ వర్గాలకు సహకారం.
- క్లస్టర్ల మేనేజ్మెంట్లను వికేంద్రీకరించడం.
- మైక్రో స్మాల్ మీడియం కంపెనీల ఉత్పత్తుల సరఫరాకు సమర్థ వ్యవస్థ ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 12 వృద్ధికారకాలతో రాష్ట్ర ప్రగతకి ప్రభుత్వం నిర్దేశం చేస్తోంది. వేగంగా అభివృద్ధి చెందడం ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని… ఉపాధి అవకాశాలతోపాటు, పరిశ్రమల వృద్ధి, తద్వారా రెండంకెల వృద్ధిని చేరుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలుగా మార్చుకొంది.