వందవ సినిమా అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ పడాలనే దిశగానే మన తెలుగు హీరోలు ప్లాన్ చేసుకుంటారు. అయితే నందమూరి హీరో బాలకృష్ణ మాత్రం చరిత్రలో నిలిచిపోయే స్థాయి గొప్ప సినిమా అవ్వాలని కోరుకున్నాడు. అందుకే ‘కంచె’ను అద్భుతంగా తీర్చిదిద్దిన క్రిష్ చెప్పిన చారిత్రకు కథకు ఒకె చెప్పాడు. ఆ విషయంలో మాత్రం అందరూ కూడా బాలయ్యబాబును అభినందించాల్సిందే. అలాగే మొదటి తెలుగు చక్రవర్తి ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ జీవితాన్ని తెరకెక్కించాలనుకున్న క్రిష్ ఆలోచన కూడా చాలా గొప్పగా ఉంది.
అయితే సినిమాను ఎలా తెరకెక్కిస్తున్నారో తెలియదు కానీ నిన్న రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్‌లో మాత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కంటే కూడా రెగ్యులర్‌గా మనకు కనిపించే సింహా బాలకృష్ణనే మరోసారి దర్శనమిచ్చాడు. సింహా రేంజ్ హీరోయిజం అనుకున్నా సింహాసనంపైన బాలయ్య కూర్చున్న విధానంలో కూడా రాజసం తగ్గింది. నిజ జీవితంలో హీరోలకు ఉన్న లోపాలను కనిపించనీయకుండా తెరపైన అద్భుతంగా చూపించడంలోనే డైరెక్టర్స్ టాలెంట్ బయటపడుతుంది. ఆ విషయంలో క్రిష్ వందశాతం సక్సెస్ అవలేకపోయాడు. మొట్టమొదటి తెలుగు చక్రవర్తి గౌతమీ పుత్ర రాజసాన్ని అయితే బాలకృష్ణ, క్రిష్‌లు తెరపైన అద్భుతః అనే స్థాయిలో ఆవిష్కరించలేకపోయారు.
సినిమా కథలోనే గౌతమీ పుత్ర శాతకర్ణి క్యారెక్టర్ కామెడీ చేసే సీన్స్ కూడా ఉండి…అందులో భాగంగా వచ్చే సీన్స్‌లో ఈ లుక్ ఉంటుంది అంటే ఒకె కానీ గౌతమీ పుత్రుడి రాజసాన్ని చూపించడానికి రిలీజ్ చేసిన లుక్ అయి ఉంటే మాత్రం లుక్‌లో చాలా లోపాలు ఉన్నట్టే లెక్క. అంతకంటే కూడా ఈ ఫస్ట్ లుక్‌లో క్రిష్ క్రియేటివిటీ కంటే కూడా బాలకృష్ణ అభిరుచులే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇలాంటి లోపాలను సరిద్ధిదుకుని తెలుగు చారిత్రక వీరుడి కథను అజరామరం అనే స్థాయిలో తెరకెక్కించడంలో క్రిష్ విజయవంతం అవ్వాలని కోరుకుందాం.