సర్జికల్ దాడి వీడియో… దాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం మన నాయకులకు అర్థమౌతున్నట్టు లేదు! మొన్నటి మొన్న కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ఆ వీడియో విడుదల చేయండని డిమాండ్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా దాడులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాడుల వీడియో చూపించాలంటూ పట్టుబట్టారు. ఆ నాయకుల అడుగు జాడల్లోనే ఆ వీడియో చూపించి, దాడుల గురించి నిజాలు ప్రజలకు చెప్పాలంటూ తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పట్టుబడుతున్నారు.
చిత్రమైన విషయం ఏంటంటే… మోకాలికీ బోడి గుండుకీ లింక్ పెట్టినట్టు, సర్జికల్ దాడులకూ ప్రత్యేక హోదాకూ లింక్‌పెట్టి జేసీ మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని నేతలు చెబుతున్న మాటల్ని ఎలా నమ్మాలని జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. సర్జికల్ దాడుల విషయంలో వారు చెబుతున్న మాటలు నిజం అనే గ్యారంటీ ఏముందంటూ సందేహం వ్యక్తం చేశారు. జర్జికల్ దాడుల గురించి ప్రశ్నిస్తే దేశద్రోహులనీ, సైన్యానికి వ్యతిరేకులనే ముద్రను సాక్ష్యాత్తు రక్షణ మంత్రే వేస్తుండటం ఆవేదన కలిగిస్తోందని జేసీ అన్నారు. భారత సైన్యం మీద అందరికీ నమ్మక ఉందన్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, మాట తప్పిన నేతల్ని ప్రజలు ఎలా నమ్ముతారు అని ప్రశ్నించారు. అందుకే, సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలను ప్రజలకు చూపించాలి అన్నారు. ఒకవేళ ప్రజలకు వీలు కాకపోతే కనీసం మాజీ ప్రధానమంత్రి, రక్షణ శాఖ మాజీ మంత్రులకైనా చూపించాలని పట్టుబట్టారు.
సర్జికల్ దాడులపై వీడియో అడగ్గానే బయటపెట్టడానికి అదేమైనా దేశంలో జరిగిన దాడి కాదు! యాక్షన్ సినిమా అంతకన్నా కాదు. సరిహద్దు అవతలకు భారత్ సైన్యం చొచ్చుకుని వెళ్లి చేసిన దాడి. ఈ వీడియో బయటకి వస్తే మన సైన్యానికి సంబంధించిన రహస్య వ్యూహాలు, మన ఆయుధాలకు సంబంధించిన సమాచారం బహిర్గతం అవుతుందని నిపుణులు సైతం చెబుతున్నారు. దీంతో, దాడుల వీడియోలపై పట్టుబట్టిన అరవింద్ కేజ్రీవాల్ కూడా మనసు మార్చుకుని, తన మాటల వల్ల సైనికుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కూడా చెప్పారు. ఇంకోపక్క, సర్జికల్ దాడులకు వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా పాకిస్థాన్ మీడియా నెత్తిన పెట్టుకుంటోంది. అరవింద్ కేజ్రీవాల్‌ని కూడా అలానే పాక్ మీడియా మోసేసింది. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలకు లెంపలేసుకున్నారు. ఇప్పుడు జేసీ కూడా దాడుల వీడియో కావాలంటున్నారు! దీనిపై ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి.