తెలుగుదేశం పార్టీకి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు! ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. సందర్భ ఏంటంటే… టీడీపీ నాయకులకు ఆపార్టీ శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా ఒక ఫొటో రాజకీయంగా కలకలం సృష్టించింది. ఉప ముఖ్యమంత్రితో నారా లోకేష్ సీరియస్‌గా మాట్లాడుతున్నట్టు, ఆ సందర్భంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప భయపడుతూ నిలబడ్డట్టు ఓ చిత్రం బయటకి వచ్చింది! అయితే, ఈ ఫొటో ఏ సందర్భంలో తీశారన్న విషయాన్ని వదిలేసి.. దీనిపై విపక్షానికి చెందిన మీడియా సంస్థ నారా లోకేష్‌పై ఓ కథనం ప్రచురించింది. పెద్దలు అంటే లోకేష్‌కు మర్యాద లేదన్నది ఆ కథనం సారాంశం, ఇక, వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా ఇదే ఫొటోని బేస్ చేసుకుని లోకేష్ మీద విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రం వైరల్ అయింది. దీంతో వాస్తవాలను వివరిస్తూ లోకేష్ ఒక బహిరంగ లేఖను జగన్‌కు రాశారు. జగన్‌కు లోకేష్ రాసిన తొలి లేఖ ఇది!
‘నీలా తండ్రినీ, చెల్లినీ, తల్లినా, చిన్నాన్నల్ని అవమానపరచేలా ప్రవర్తించడం నాకు తెలీద’ని లోకేష్ లేఖ ద్వారా జగన్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శించారు. పెద్దలను ఏవిధంగా గౌరవించాలో ఎంత సంస్కారవంతంగా వారిపట్ల ప్రవర్తించాలో తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను అన్నారు. అనారోగ్య సమస్య వల్ల శిక్షణ శిబిరానికి రాకపోతే తనకూ తండ్రికీ విభేదాలున్నాయని వక్రీకరిస్తారా అని ప్రశ్నించారు. సమావేశంలో ఒక అంశంపై మాట్లాడుతుండగా తలెత్తిన అనుమానాలను చినరాజప్ప నివృత్తి చేశారనీ, అప్పుడు తాను మాట్లాడననీ, ఆ సందర్భంలో బెదిరింపులకు ఆస్కారం ఎక్కడుందని లోకేష్ ప్రశ్నించారు.
ఈ సందర్భంలో తనకీ ఉప ముఖ్యమంత్రికీ మధ్య జరిగి చర్చ ఏంటనేది నాయకులందరూ చూస్తున్నారనీ, దానికి కూడా వక్రభాష్యం చెబుతూ కథనాలు ప్రచురిస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారని లోకేష్ విరుచుకుపడ్డారు. ‘అసత్యాలను ప్రచురిస్తూ తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ప్రచారం చేస్తున్న మీరు, ప్రజలకు ముందుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ’ లోకేష్ డిమాండ్ చేశారు. మొత్తానికి ఈ ఫొటో విషయంలో వైకాపా కాస్త తొందరపడిందనే అనిపిస్తోంది. ఎందుకంటే, చినరాజప్ప లోకేష్ ఏం మాట్లాడుకున్నారో అనే వీడియోని కూడా టీడీపీ విడుదల చేసింది. ఆ వీడియోలో పార్టీ నిర్మాణానికి సంబంధించిన చర్చ మాత్రమే ఉంది. లోకేష్‌కు వచ్చిన డౌట్‌ను చినరాజప్ప క్లారిఫై చేస్తున్నారు.