ఈ దసరాకి సినీ సరదాలు ఓ రేంజులో ఉండబోతున్నాయి. ఇప్పటికే థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేసేస్తున్నాయి. దసరా రోజున స్టార్లు కొత్త లుక్కులతో టీజర్లలో హడావుడి చేయడానికి సిద్దమయ్యారు. నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి టీజర్ మంగళవారం ఉదయం ఆన్లైన్లో రిలీజ్ చేయబోతున్నారు. 40 సెకన్ల పాటు సాగే ఈ టీజర్లో రెండు పవర్ ఫుల్ డైలాగులు వదలబోతున్నాడట బాలకృష్ణ. ”సమయం మించిపోతోంది మిత్రమా…. మరణమా, శరణమా” అనే టైపులో ఓ డైలాగ్ ఉందట. టీజర్ హాలీవుడ్ సినిమా స్థాయిలో కట్ చేశారని, ఇక అభిమానులకు పండగే అని సమాచారం. ఉదయం బాలయ్య పండగ గిఫ్ట్ ఇస్తే.. సాయంత్రం రామ్‌చరణ్ టీజర్ వదులుతున్నాడు. చరణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ధృవ. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ తెరకెక్కించింది. దృవ టీజర్‌ని 11వ తేదీ మంగళవారం సాయింత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. నిజానికి ఈ దసరా బరిలోనే ధృవ నిలవాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యం అవ్వడంతో.. దృవ వెనక్కి వెళ్లింది. అయితే ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరచడం ఇష్టం లేని చరణ్.. ఈ దసరాకి టీజర్‌ని విడుదల చేయడానికి రంగం సిద్దం చేసుకొన్నాడు. నవంబరు ఆఖర్లోగానీ, డిసెంబరు మొదటి వారంలోగానీ ధృవ సినిమా విడుదల చేసే అవకాశం ఉంది. అన్నట్టు…. చిరంజీవి ఖైదీ నెం.150 టీజర్ కూడా విడుదల చేద్దామకొన్నార్ట. అయితే ధృవ ఉండడం వల్ల.. ఖైదీ నెం. టీజర్ దీపావళికి పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. నాగార్జున నటిస్తున్న ఓం నమోవేంకటేశాయకు సంబంధించిన టీజర్ దసరా పండక్కి బయటకు వచ్చే అవకాశాలున్నాయి.