మొగలి రేకులు లాంటి సీరియల్‌తో బుల్లి తెర వీక్షకుల్ని ఆకట్టుకోగలిగాడు సాగర్. ఆ పాపులారిటీని నమ్ముకొని వెండి తెరపై అడుగుపెట్టాడు. తాను నటించిన సిద్దార్థ్ ఒక్కరోజు కూడా థియేటర్లలో నిలవలేదు. ఎంత పబ్లిసిటీ చేసినా.. ఈ సినిమా చూడ్డానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదు. ఒక్క సినిమాకే సాగర్ పని అయిపోయిందనుకొన్నారంతా. అయితే. అట్టర్ ఫ్లాప్ ఇచ్చినా.. తనకు హీరోగా మరో అవకాశం వచ్చింది. సాగర్ హీరోగా ఓ కొత్త సినిమా మొదలవుతోంది. ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి ‘మానస చోరుడు’ అనే మంచి టైటిల్ కూడా పెట్టారు.
సిద్దార్థ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో సాగే సినిమా. ఈసారి మాత్రం థ్రిల్లర్ కథాంశాన్ని ఎంచుకొన్నారని తెలుస్తోంది. విజయ దశమి రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారట. 2017 ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నద్దం అవుతోంది చిత్రబృందం. తొలి సినిమాలో నటుడిగా మంచి మార్కులే పడ్డాయి సాగర్‌కి. అయితే డబ్బింగ్ మాత్రం కుదర్లేదు. ఈ సినిమాలో మాత్రం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలనుకొంటున్నాడని తెలుస్తోంది. మానస చోరుడు కనీసం యావరేజ్ టాక్ తెచ్చుకొన్నా సాగర్ గట్టెక్కేసినట్టే. లేదంటే.. మూడో ఆఫర్ రావడం కష్టమే.