తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి శాస్త్రోక్తంగా జరగనుంది. ప్రతిదానికీ పక్కా ముహూర్తాన్ని నిర్ణయించారు. జిల్లాల విభజనలో శాస్త్రీయత లేదనే విమర్శలు వచ్చాయి. వాటి ప్రారంభం మాత్రం శాస్త్రోక్తంగా చేస్తున్నారు.
సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ కీలకమైన పనులు, నిర్ణయాలు జరుగుతాయి. కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత 12.12గంటలకు విడుదలవుతుంది. సుముహూర్తంలోనే నోటిఫికేషన్ పని పూర్తి చేయాలనేది కేసీఆర్ అభిప్రాయం.
జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఎస్పీల నియామకాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకం కూడా అర్ధరాత్రి దాటిన తర్వాతే చేస్తారు. దీనికి వేకువ జాము 2 గంటలను ముహూర్తంగా నిర్ణయించారు. ఆ వేళకు దస్ఖత్ చేస్తారు.
సిద్దిపేట జిల్లాను కేసీఆర్ ప్రారంభించేది ఎప్పుడనేదానిపైనా పక్కా ముహూర్తం ఖరారైంది. దసరా నాడు ఉదయం 11 గంటల 12 నిమిషాలకు కొత్త జిల్లా ప్రారంభోత్సవం జరుగుతుంది. జిల్లా ప్రారంభోత్సవం నభూతో అనే స్థాయిలో అట్టహాసంగా ఉంటుంది. కిలోమీటర్ల పొడవునా కేసీఆర్ కు ఘన స్వాగతం, వేల మంది మహిళల మంగళహారతులు వగైరా కార్యక్రమాల కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.
ప్రతి జిల్లాలోనూ అట్టహాసంగా ఏర్పాట్లతోపాటు మిఠాయిల పంపిణీ ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. రాష్ట్రావతరణ వేడుకలను తలపిస్తూ జిల్లా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఖర్చుకు వెనుకాడకుండా ప్రభుత్వం భారీగా సన్నాహాలుచేస్తోంది. పట్టణాలు విద్యుద్దీప కాంతులతో పట్టపగలును తలపిస్తాయి. సిద్దిపేట వంటి పట్టణాలైతే పూలవనాల్లా మారాయి. ఇప్పటికీ కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై వినతులు వస్తూనే ఉన్నాయి. కొన్నింటిపై కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తున్నారు. షాద్ నగర్ డివిజన్ ఏర్పాటుకు ఆయన అనూహ్యంగా ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని మార్పులు చేర్పులు కూడా జరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తానికి తుది నోటిఫికేషన్ జారీ అయ్యే వరకూ కొంత సస్పెన్స్ తప్పక పోవచ్చు. కేబినెట్ సమావేశంలో జిల్లాలు డివిజన్లు, మండలాల సంఖ్య ఖరారయ్యే వరకూ మార్పులు జరుగుతుంటాయేమో చూడాలి.