తండ్రి దగ్గుబాటి సురేష్‌బాబు తీస్తున్న సినిమాలో తొలిసారి నటించడంపై రానా ట్వీట్టర్ పోస్టు చేయడం, దానికి స్పందనగా తండ్రులు చాలా కఠినమైన (టఫ్) బాస్‌లు అని తెలంగాణ మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించడం ఆసక్తికరమే. తరాల మార్పులో స్వరాల మార్పును సమన్వయం చేసుకుని ముందుకు సాగడం ఎవరికైనా కసరత్తే. వారసత్వాలు వీరతత్వాల లేదా నీరసత్వాల గురించి ప్రజలు చర్చించుకుంటారు గాని తండ్రులు కొడుకుల మధ్య కూడా సర్దుబాట్లు తప్పవు. నాగార్జున వచ్చిన కొత్తలో అక్కినేని బహిరంగంగానే వ్యాఖ్యానించేవారు- నేనే చాలా తిరగబడే పాత్రలు వేశాను, ఇప్పుడు తానొచ్చి తిరగబడుతుంటే నేను తండ్రిగానో లేక తాతగానో వేస్తానా అని. ఇక బాలకృష్ణ అయితే ఏకంగా తిరుగుబాటే చేశారు. సామ్రాట్ అశోక చిత్రం కథ కాన్సెప్ట్ నచ్చక చేయడానికే నిరాకరించారు. ( ఈ ఉదంతాన్ని చాలామంది సరదా సారంగధర అనేవారు) తన తండ్రి ఎన్టీఆర్ చాణక్య-చంద్రగుప్తలో చంద్రగుప్తుడుగా వేయమని అక్కినేనిని ఎలా అడిగారో అర్థం కాదని ఆయన కోపంగానే వ్యాఖ్యానించిన ఇంటర్వ్యూ నెట్లో వుంటుంది. అయితే కెటిఆర్, రానాలు తండ్రుల ఆశీస్సులు అండదండలు పుష్కలంగా కలిగి వున్నవారే. కెటిఆర్ సంగతి ఎలాగూ రోజూ కనిపిస్తూనే వుంటుంది. ఎంత టఫ్ బాస్లైనా స్వంత బిడ్డలనే సరిగా ఐస్లుగా మారిపోతుంటారు కదా! లేకపోతే అంతగా బడ్జెట్ లెక్కలు వేసుకునే అల్లు అరవింద్ ఒక్క పాట కోసం అర్జున్ పట్టుపడితే కోట్లు ఖర్చు చేశానని ప్రకటిస్తారా? మెగాస్టార్ చిరంజీవి సరే కుమారుడి చిత్రాల్లో కనిపించారు కూడా.
ఇదంతా ఏమో గాని రానా విషయంలో సురేష్ చాలా సంతృప్తిగా వుంటారు. గత ఏడాది నేను ఆయనను నా ప్లెయిన్ స్పీక్ కోసం ఇంటర్వ్యూ చేసినపుడు ఆన్ ఆఫ్ ద రికార్డులలో కుమారుడి గురించి సంతోషంగానే మాట్లాడారు. అప్పుడే బాహుబలి విడుదలైంది. రానా ఒక విధంగా అనేక బాషల్లో నటించి మినీ నేషనల్ యాక్టర్‌గా మారుతున్నారని సురేష్ అనడం నాకు గుర్తుంది. తండ్రి రామానాయుడు గురించి కూడా ఆయన అలాగే మాట్లాడారు. పరిశ్రమకు సంబంధించిన వివాదాలు అలా వుంచితే సురేష్ బాబుకు చిత్రాలపై చాలా స్పష్టత వుంది. దానికి తోడు పుత్ర వాత్సల్యం .. సో రాణించడమే రానా పని.