నారా లోకేష్‌పై అభిమానాన్నీ ప్రేమనూ చాటుకునే అవకాశాన్ని వస్తే… కొంతమంది దేశం నాయకులు జారవిడుచుకోరు అని ఆరోపణలు ఉన్నాయి లెండి! తాజాగా అలాంటి సందర్భమే ఒకటి వచ్చింది. దీంతో లోకేష్ మీద ప్రేమాభిమానాలను కురిపించేస్తున్నారు కొంతమంది తెలుగుదేశం నేతలు. యువనాయకుడికి అండగా నిలబడటం ఒకెత్తు అయితే, ఆ క్రమంలో తమ స్వామి భక్తి ప్రదర్శనకు కూడా కొంతమంది ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తున్నారు. అధికార, విపక్షాల మధ్య విమర్శలూ ప్రతి విమర్శలకూ లోకేష్ కేంద్రబిందువు అయిన సంగతి తెలిసిందే. లోకేష్ వ్యవహార శైలీ, లోకేష్ ప్రవర్తనాతీరు… ఈ అంశాలపైనే గడచిన రెండు రోజులుగా ఏపీ రాజకీయాల్లో చర్చలు మార్మోగిపోతున్నాయి. ఈ తరుణంలో లోకేష్‌కు అండగా తెలుగుదేశం నేతలు నిలవడం అనేది సహజం. మంత్రి దేవినేని ఉమ, చినరాజప్ప వంటివారు అదే పనిలో ఉన్నారు! ఈ క్రమంలో ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, వైవీబీ రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్లు చేస్తున్న ప్రకటనలు కాస్త విడ్డూరంగా అనిపిస్తున్నాయి!
లోకేష్‌ను కలియుగ అభిమన్యుడిగా అభివర్ణించేశారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పద్మవ్యూహాన్ని ఛేదించుకుని ఎలా బయటకి రావాలో నారా లోకేష్‌కు తెలుసునని అన్నారు. లోకేష్ విషయంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్న బొత్స సత్యనారాయణ, లక్ష్మీ పార్వతిపై కేసులు పెట్టాలని ఆయన సూచించారు. మరో ఎమ్మెల్యే నక్కా ఆనందరావు మాట్లాడుతూ… లోకేష్‌కు పదవీ కాంక్ష లేదని, పార్టీ కోసమూ కార్యకర్తల కోసం ఎంతో కష్టపడుతున్నారని కితాబిచ్చారు! లోకేష్‌కి పదవీ కాంక్ష లేదనీ, ఎలాంటి పదవులూ ఆశించకుండా నిస్వార్థంగా కార్యకర్తల సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్టుగా ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఓ గొప్ప సలహా ఇచ్చారు! నారా లోకేష్‌పై వెల్లువెత్తుతున్న ఆరోపణలన్నింటికీ చెక్ పెట్టాలంటే ఒకటే పరిష్కారం అన్నారు.
చినరాజప్ప పొటో విషయంలో వైపాకా దుష్ప్రచారం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కుమారుడు అయినాసరే లోకేష్ ఎంతో మర్యాదగా అందరితోనూ మెలుగుతారని సర్టిఫై చేశారు. విపక్షం చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలంటే ముందుగా ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకేష్‌ను మంత్రిని చేస్తే అన్ని విమర్శలకీ చెక్ పెట్టినట్టు అవుతుందని తేల్చి చెప్పారు వైవీబీ. మొత్తానికి లోకేష్ ఫొటోల వివాదాంశంగా మారిన నేపథ్యంలో తెలుగుదేశం నేతలు పోటీలు పడుతూ పొగడ్తల కార్యక్రమం పెట్టేస్తున్నారు. స్వామి భక్తి ప్రదర్శనకు అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. వచ్చినప్పుడు తగ్గకూడదు కదా!