విజయ దశమి… విజయాల పండగ! ఆనందాల వేడుక. విజయాల గురించి మాట్లాడుకోవాల్సిన తరుణం ఇది. అదృష్టవశాత్తూ మన స్టార్ హీరోల్లో చాలామంది విక్టరీలతో జోరుమీదున్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగార్జున, నాగచైతన్య, రవితేజ, నాని, సాయిధరమ్ తేజ్.. వీళ్లబండి జోరుగా సాగుతోంది. కొంతమంది హీరోలు మాత్రం విజయాలకు మొహం వాచిపోయారు. ఒక్క హిట్టు పడితే గానీ.. బండి మళ్లీ లైన్‌లోకి రాదు. హిట్లతో జోరుమీదున్నవాళ్లు కూడా… ఆఖరి సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఒత్తిడిలో పడ్డారు. పవన్ కల్యాణ్, మహేష్ బాబులాంటి టాప్ స్టార్ల నుంచి సునీల్, అల్లరి నరేష్ వరకూ ఉన్న మినిమం గ్యారేంటీ హీరోలు ఫ్లాపులను ఎదుర్కొన్నారు. వాళ్లకు అర్జెంటుగా విజయలక్ష్మి వరించేయాల్సిందే.
నేనొక్కడినే, ఆగడు ఫ్లాపుల తరవాత శ్రీమంతుడు మహేష్‌కి బాగా రిలీఫ్ ఇచ్చింది. ఆ సినిమా వంద కోట్లు దాటడంతో మహేష్ రేంజ్ పెరిగింది. అయితే బ్రహ్మోత్సవం డిజాస్టర్ మళ్లీ మహేష్‌ని ఒత్తిడిలోకి నెట్టేసింది. మురుదాస్ తో సినిమా మహేష్ చాలా ప్రెస్టేజియస్ గా తీసుకొన్నాడు. అందుకే అన్ని శక్తులూ ఈసినిమా కోసం ధారబోస్తున్నాడు. మరోవైపు పవన్ కల్యాణ్ పరిస్థితీ అంతే. అత్తారింటికి దారేది వంద కోట్ల సినిమాగా నిలిచింది. గోపాల గోపాల ఓ మాదిరిగా ఆడింది. అయితే.. భారీ అంచనాలు మోసుకొచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ల జాబితాలో చేరింది. ఇప్పుడు కాటమరాయుడు పనిలో ఉన్నాడు పవన్. ఆ సినిమా ముక్కుతూ మూలుగుతూ నడుస్తోంది. త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకొన్నాడు పవన్. ఎ.ఎం.రత్నం బ్యానర్‌లో సినిమా కూడా ఈరోజే పట్టాలెక్కింది. ఈ మూడు సినిమాల్లో కనీసం రెండు హిట్లు చేరితే తప్ప.. పవన్ ఫ్యాన్స్ మళ్లీ జోష్‌లోకి రారు.
మెగా హీరోల్లో రామ్ చరణ్ పరిస్థితే ఘోరంగా ఉంది. గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ ఫ్లాపులతో డీలా పడ్డాడు చరణ్. మధ్యలో బాలీవుడ్ ఎంట్రీ కూడా దారుణంగా బెడసి కొట్టింది. తన తోటి హీరోలంతా హిట్లమీద హిట్లు కొట్టుకొంటూ వెళ్తే… చరణ్ మాత్రం ఫ్లాపుల ఊబిలోంచి బయటకు రావడం లేదు. అతని దృష్టంతా ఇప్పుడు ధృవ మీదే. ఈ సినిమాతో హిట్టు కొట్టకపోతే.. చరణ్ కెరీర్ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆ తరవాత సుకుమార్ సినిమానా చర్రీ చాలా ఆశలే పెంచుకొన్నాడు. సునీల్ జాతకం బాలేదు. ఏ సినిమా చేసినా ఫట్ మంటోంది. కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డెహె.. వరుసగా పరాజయాల హ్యాట్రిక్ పూర్తయినట్టైంది. అల్లరి నరేష్ సుడిగాడు తరవాత మరో హిట్టు కొట్టలేదు. తిక్క సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. సాయిధరమ్ తేజ్ విజయాలకు బ్రేక్ పడినట్టైంది. పటాస్‌తో ఓ హిట్టు కొట్టి ఊపిరి పీల్చుకొన్న కల్యాణ్ రామ్.. ఆ తరవాత మళ్లీ షేర్ తో ఫ్లాపుల బాట పట్టాడు. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఇజంపైనే ఈ నందమూరి హీరో హోప్స్ ఉన్నాయి. వీళ్లంతా ఇప్పుడు అర్జెంటుగా హిట్లు కొట్టేసి రేసులోకి వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అదృష్టవశాత్తూ అందరి చేతిలో కావల్సిన స్థాయిలో సినిమాలున్నాయి. మరి ఈ విజయదశమి వైభవం వాళ్లపై కాస్తో కూస్తో పడి.. హిట్టు అందుకొంటే అదే పది వేలు.