తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రికి వెళ్లిన దగ్గర నుంచీ రాజకీయ సంక్షభం దిశగా ఒక్కో అడుగూ పడుతోందన్న సంకేతాలు వెలువడేవి. రాష్ట్రంలో సాధారణ పరిపాలన పడకేసిందనే చెప్పాలి. అమ్మ ఆసుపత్రిలో చేరి దాదాపు 20 రోజులు కావొస్తోంది. కానీ, ఆమె ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన ప్రకటనలంటూ ఏవీ వెలువడడం లేదు. ఈ ఆందోళన తమిళ ప్రజల్లో ఉంటే… రాష్ట్రంలో పరిపాలన సంగతి ఏంటనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే, కీలక శాఖలన్నీ ముఖ్యమంత్రి జయలలిత దగ్గరే ఉన్నాయి. క్యాబినెట్ సమావేశాలు నిర్వహించే పరిస్థితీ లేదూ, ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇంకోపక్క వారసుల రచ్చ ఒకటీ! ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి గవర్నర్ కార్యాలయం ఉంచి ఒక కీలక ప్రకటన వెలువడింది.
జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వమ్‌కు అమ్మ దగ్గరున్న శాఖల బాధ్యతలు అప్పగించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి జయలలితే స్వయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సోమవారం నాటికి ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైందని వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాధారణ పాలన గురించి ఆమె సమీక్షించారని సమాచారం. తన ఆరోగ్య పరిస్థితి మెరుగు కావాలంటే ఇంకొన్నాళ్లు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి, తన దగ్గరున్న కీలక శాఖల బాధ్యతల్ని మంత్రి పన్నీర్ సెల్వమ్ కు బదిలీ చేస్తూ అమ్మ నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.
కీలక శాఖలైన హోంశాఖ, ప్రజా సంబంధాల శాఖ, రెవెన్యూ శాఖ, సాధారణ పరిపాలన శాఖ… ఇవన్నీ ముఖ్యమంత్రి అధీనంలోనే ఇంతవరకూ ఉన్నాయి. ఇకపై ఈ శాఖల బాధ్యతలన్నీ పన్నీర్ సెల్వమ్ చూసుకుంటారు. అంతేకాదు, క్యాబినెట్ సమావేశాలు నిర్వహించే బాధ్యతల్ని కూడా ఆయనకే అప్పగించినట్టు కూడా గవర్నర్ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకరకంగా చెప్పాలంటే దాదాపు తాత్కాలిక ముఖ్యమంత్రి బాధ్యతల్నే ఇకపై పన్నీర్ సెల్వమ్ నిర్వహిస్తారు! ఎందుకంటే, ఆయన ఆర్థిక శాఖ మంత్రి. దాంతోపాటు ఇప్పుడు హోం, రెవెన్యూ, సాధారణ పాలన, ప్రజాసంబంధాల శాఖల బాధ్యతలు కూడా ఆయనకే దక్కాయి. అంటే, రాష్ట్ర పరిపాలనను అంతా ఆయన ముఖతాగానే ఇకపై జరుగుతుంది. అయితే, తాత్కాలిక ముఖ్యమంత్రి అనే మాటలను మాత్రం ఆయన ఒప్పుకోవడం లేదు! ఇదే విషయం రెండుమూడు రోజుల కిందట గవర్నర్ ప్రస్థావనకు తీసుకొస్తే పన్నీర్ సెల్వమ్ అంగీకరించలేదు! ఎందుకంటే, ముఖ్యమంత్రి స్థానానికి ప్రత్యామ్నాయం ఉండకూడదని అంటున్నారట. ఆయన దృష్టిలో ‘ముఖ్యమంత్రి అంటే అమ్మ’ అని మాత్రమే చెబుతున్నారట!