సినిమా సిద్దాంతాలంటూ కొన్నుంటాయి. ఆ రూట్స్ని పక్కన పెట్టడానికి రాంగోపాల్ వర్మ ఎప్పుడూ రెడీనే. అసలు రూల్స్ ని బ్రేక్ చేశాడు కాబట్టే… వర్మ మాటలకు, చేతలకూ అంత పాపులారిటీ వచ్చిందేమో?? రామూ కొత్త చిత్రం వంగవీటి విషయంలోనూ వర్మ తన పంథాలోనే సాగుతున్నాడు. ట్రైలర్ రూపంలో మూడున్నర నిమిషాల నిడివి ఉన్న షాట్స్ చూపించేశాడు వర్మ. తెలుగులో ఇంత లెంగ్తీ ట్రైలర్ మరోటి లేదు. ఇప్పుడు వంగవీటిలో కొన్ని షాట్స్ అంటూ.. మరో ట్రైలర్ వదిలాడు. ఇందులో డైలాగులు లేకపోయినా.. సినిమాలో కొన్ని ముఖ్య ఘట్టాల్ని ఎలా తెరకెక్కించాడో వర్మ చూపించేశాడు. ట్రైలర్లు, టీజర్లు వదలడానికి దర్శక నిర్మాతలు, హీరోలు కాస్త జంకుతారు. వాటిలోనే సినిమా మొత్తం చూపించేస్తున్నామేమో అన్న కంగారు వాళ్లది. సినిమాలో ఉన్నదల్లా ట్రైలర్లు, టీజర్లలో చూపించేస్తే.. వెండి తెరపై ఏం చూపిస్తాం? అన్న భయం వాళ్లది. కానీ వర్మ అలా ఆలోచించడు కదా. అందుకే ధైర్యంగా ముందడుగు వేశాడు. తాజాగా విడుదల చేసిన వీడియోలో కొన్ని షాట్స్ నిజంగా అబ్బుర పరుస్తాయి. వర్మ స్థాయి టేకింగ్కి ప్రతిరూపంగా నిలిచిన కెమెరా మూమెంట్స్ కొన్ని కనిపిస్తాయి. దాంతో.. ఈ సినిమాపై కాస్తో కూస్తో ఆశలు, అంచనాలు పెరగడం ఖాయం.
మామూలు ప్రేక్షకుల మాట ఎలా ఉన్నా, వర్మ అంటే పడి చచ్చే వీరాభిమానులు తప్పకుండా ఈసినిమాని ఇక నుంచి వేరే కోణంలో చూడడం ఖాయం. ‘తెలుగులో ఇదే నా చివరి సినిమా’ అని ప్రకటించిన వర్మ… నిజంగానే ఈ సినిమాపై అంతులేని ప్రేమ పెంచుకొని తీర్చిదిద్దాడేమో అనే అనుమానం వేస్తోంది. వరుసగా ఎన్ని ఫ్లాపులిచ్చానా, మధ్యమధ్యలో తనదైన స్టైల్లో ఓ సినిమా తీసి ‘వర్మలోని దర్శకుడు ఇంకా బతికే ఉన్నాడు’ అని నిరూపించుకోవడం వర్మకి అలవాటే. వంగవీటి కూడా ఆ అలవాటుని కొనసాగించాలని కోరుకొందాం.