హైదరాబాద్: నాగార్జున ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘ఊపిరి’ అనే రెండు చిత్రాలను చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి నూతన దర్శకుడు కళ్యాణకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు…. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక ఫ్రెంచ్ చిత్రం ది ఇన్‌టచబుల్స్ రీమేక్‌గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ ఊపిరిలో కార్తి మరో హీరోగా, తమన్నా హీరోయిన్గా ఉన్నారు.
ఇదిలా ఉంటే నాగార్జున రెండు చిత్రాలలో అతిథి పాత్రలలో నటిస్తున్నారన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న సైజ్ జీరోలో అనుష్క, తమిళ నటుడు ఆర్య జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క బొండాంలాగా కనిపిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంలో నాగార్జున గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. తన షూటింగ్ పార్ట్ ఇంకా పూర్తి కాలేదని నాగ్ చెప్పారు. మరోవైపు హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ పరిచయమవుతున్న నిర్మలా కాన్వెంట్ చిత్రంలోకూడా నాగ్ అతిథి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం కథ తనకు బాగా నచ్చి గెస్ట్ రోల్ పోషిస్తున్నట్లు నాగార్జున చెప్పారు. ఈ చిత్రం స్క్రిప్ట్‌ను అక్కినేని యాక్టింగ్ స్కూల్ విద్యార్థి ఒకరు రాయటం విశేషం. మంచి స్క్రిప్టులు దొరికితే మరిన్ని చిత్రాలు నిర్మించటానికి తాను సిద్ధమని నాగ్ చెప్పారు. తన పుట్టినరోజైన 29వ తేదీన తమ కుటుంబంలోని ముగ్గురు హీరోలవీ, తనదీ, నాగ చైతన్యదీ, అఖిల్‌దీ ప్రొమోషనల్ వీడియోలు రిలీజ్ అవుతాయని నాగ్ వెల్లడించారు.
కొసమెరుపు: అనుష్క ‘సైజ్ జీరో’లో నాగ్ గెస్ట్ రోల్ పోషిస్తుండగా, మల్టీ స్టారర్ ‘ఊపిరి’ చిత్రంలో అనుష్క గెస్ట్ రోల్లో నటిస్తోంది.